రాచకొండలో ఫిల్మ్ సిటీ వచ్చేస్తోంది. యూనివర్శిటీలు కూడా వస్తాయట. ఈ సందర్భంగా రాచకొండకున్న చారిత్రక ప్రాధాన్యత గురించి కూడా కవర్ స్టోరీలు వస్తున్నాయి. అక్కడున్న గుహలు, జలపాతాలు, గుట్టలు గురించి కథనాలు, ఫోటోలు విరివిగా వస్తున్నాయి. సినిమా సెట్టింగుకై యివి అద్భుతంగా పనికి వస్తాయి అని కొందరు రాస్తే, వీటిని కాపాడుకోవాలని మరికొందరు రాస్తున్నారు. ఇన్నాళ్లూ టూరిస్టు స్పాట్‌గా ఎందుకు డెవలప్ చేయలేదని అడుగుతున్నారు. నల్గొండ జిల్లాలో అన్ని పార్టీల నుండి కుప్పలుతిప్పలుగా నాయకులున్నారు. మంచిమంచి పదవులు అధిష్టించారు. అక్కడ ఫోరైడ్ సమస్యను పరిష్కరించలేదు. ఇలాటివాటిని టూరిస్టు కేంద్రాలుగా అభివృద్ధి చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగితే సమైక్యపాలకులు మమ్మల్ని చేయనీయలేదని యిటీవల చెప్తున్నారు. కాంట్రాక్టులు తీసుకోమనీ, సొంత ఆస్తులు కూడబెట్టుకోమనీ మాత్రం వాళ్లు చెప్పారా? వాస్తవమేమిటంటే వాళ్లు తమ ప్రాంతం గురించి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు కెసియార్ దృష్టి వాటిపై పడింది.
తెలుగు రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ భాగం రెడ్లదే పాలన. వాళ్లు తప్ప మరొకరు పాలనకు తగరు అనే అభిప్రాయం కలిగేటంతగా! వాళ్ల ప్రాబల్యం తగ్గించాలని ఇందిరా గాంధీ అనుకుని బ్రాహ్మణుడైన పివిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన అధికారం నిలుపుకోలేక పోయాడు. తర్వాత వెలమ అయిన జలగం వెంగళరావుకి ఆ పదవి కట్టబెట్టారు. ఆయన దిగిపోయి 35 ఏళ్లయినా మరొక వెలమ ముఖ్యమంత్రి కాలేదు. ఇన్నాళ్లకు తెలంగాణ ఉద్యమం ధర్మమాని ఆ లోటు తీరింది. వెలమలు కూడా ఒకప్పుడు పాలకులే, వారికీ రాజ్యం చేయడం వచ్చు అనే సందేశం ప్రజల్లో వెళ్లడానికి కాబోలు రాచకొండపై అందరి దృష్టీ పడేట్లు చేశారు కెసియార్. పద్మనాయకులు (వెలమ) కాకతీయ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా వుండి, తర్వాతి కాలంలో 14, 15 శతాబ్దాలలో రాచకొండ రాజధానిగా తెలంగాణను పాలించారు. చెరువులు తవ్వించారు, రాజులే స్వయంగా కవులై కళలను పోషించారు. ఇప్పుడు పాడుపడినట్లు కనబడుతున్నా గుహల్లో కుడ్యచిత్రాలున్నాయి.
ఇలాటి ప్రదేశాలను పురావస్తు శాఖ రక్షిస్తూంటుంది. అక్కడ టూరిజాన్ని వృద్ధి చేయబోయినా వాళ్లు హర్షించరు. ఎందుకంటే చూడడానికి వచ్చిన యాత్రికులు వూరికే వుండరు. అక్కడి రాళ్లపై, భవనాలపై తమ పేర్లు చెక్కుతారు. 'ఫలానా లవ్స్ ఫలానా' అంటూ ప్రేమ గుర్తుతో సహా గీసి, లోకానికి చాటుకుంటారు. తినుబండారాలు తెచ్చి తిని పారేయడంతో కుక్కలు, పందికొక్కులు, గద్దలు వచ్చిపడి ఆ ప్రాంతమంతా కశ్మలం చేసేస్తాయి. యాత్రికుల కోసం వెలసిన టీస్టాళ్లు, హోటళ్లు, లాజ్‌లు, షాపులు యివన్నీ అక్కడున్న వస్తువుల చారిత్రక ప్రాధాన్యం గ్రహించకుండా వాటిని తిరగేసో, బోర్లేసో, పగలకొట్టో వాడుకుంటాయి. శాసనాల రాళ్లను చాకలిబండలుగా వాడుకుని అక్షరాలు చెరిగిపోయేట్లా చేసిన వుదంతాలు కూడా వున్నాయి. అయినా టూరిజం వృద్ధి చెందితే ఆదాయం పెరిగి, వారసత్వ సంపదను రక్షించేందుకు సొమ్ము సమకూరుతుంది. లేకపోతే నిధుల లేమితో నిర్లక్ష్యానికి గురవుతుంది. అందువలన టూరిస్టు స్పాట్‌గా చేసినపుడు ముఖ్యమైన కట్టడాలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి, సెక్యూరిటీ పెట్టి అప్పుడు యాత్రికులను అనుమతించాలి. తెలంగాణ చరిత్రను హైలైట్ చేస్తానంటున్న ప్రస్తుత ప్రభుత్వం యిలాటి పనులు చేయాలి. రాచకొండే కాదు, కోటిలింగాల యిత్యాది ప్రదేశాలను టూరిస్టు స్పాట్‌లుగా మార్చాలి. గుణాఢ్యమందిరం, పాల్కురికి సోమన మందిరం, గోన బుద్ధారెడ్డి మందిరం, జాయపసేనాని మంటపం వంటివి నిర్మించి వారి గురించి ప్రచారం చేసి ప్రజల్లో తమ జాతి పట్ల గౌరవం పెంచుకునేట్లా చేయాలి. ఆంధ్ర రాజధాని కూడా చారిత్రాత్మక ప్రదేశాల్లో వెలుస్తోంది. వాటికి విఘాతం కలగకుండా ఎలా అభివృద్ధి చేస్తారో తెలియదు.
కెసియార్ దృష్టిలో అసెంబ్లీ భవనం చారిత్రక కట్టడం, సుల్తాన్‌బజార్‌లోని దుకాణాలు మొజంజాహీ మార్కెట్ షాపులు చారిత్రక కట్టడాలు. పాతబస్తీలో పాతిక, ఏభై ఏళ్ల కితం కట్టుకున్న మసీదులు కూడా చారిత్రక కట్టడాలే. వాటికి విఘాతం కలగకుండా వుండాలని వెయ్యి కోట్ల ప్రజధానంతో మెట్రో రూటు మార్పిస్తున్నారు. అవన్నీ చారిత్రక కట్టడాలయినప్పుడు రాచకొండ గుట్టలు చరిత్రకు ఆనవాళ్లు కావా? వాటిని పరిరక్షించవలసిన అవసరం లేదా? రాచకొండలో పరిరక్షణమాట, టూరిజం మాట ఎలా వున్నా ఫిలిం సిటీ వచ్చేస్తోందంటున్నారు. సినిమా వాళ్ల సంగతే వేరు. సినిమా షూటింగుకై అద్దెకు కాని, వూరికే గాని తమ యిళ్లు యిచ్చినవారిని అడిగి చూడండి, ఎంత బీభత్సం చేస్తారో! వాళ్లు కావాలని పాడు చేయరు కానీ వాళ్లకు తగిన విధంగా యింటిని మార్చేస్తారు. 'ఇది క్రైస్తవుల యిల్లులా చూపిస్తున్నాం, మీ పూజగది వ్యూలోకి వస్తోంది. అది ఎత్తేయండి', 'ఈ సోఫా ఎటూ కాకుండా అడ్డం వస్తోంది, దాన్ని సగానికి కోసేస్తే మీరేమైనా ఫీలవుతారా?' 'ఈ భారీ శాండిలియర్‌పై సూర్యకాంతి పడి గ్లేర్ కొడుతోంది, కిందకు దింపేస్తాం' .. యిలా వుంటాయి వాళ్ల కోరికలు.
దింపేసిన శాండలియర్ పగిలిపోతుంది, మళ్లీ పైకి ఎక్కించరు. గార్డెన్‌లో మొక్కలు ధ్వంసం. కొన్ని సందర్భాల్లో యిళ్లల్లో వస్తువులు మాయం కావడం, లేదా నాశనం కావడం, అపురూపంగా తెచ్చుకున్న షో పీసెస్ ముక్కలు కావడం, కెమెరాలు, ట్రాలీల కారణంగా గచ్చు పాడవడం – ఒకటి కాదు, రకరకాలుగా వుంటుంది అవస్థ. ఒక కోణంలో ఆలోచించి యిల్లు ప్లాన్ చేస్తారు, సినిమా వాళ్ల కోణం వేరు. సినిమాసినిమాకు ఫోటోగ్రాఫర్ బట్టి ఆ కోణం మారుతుంది. ఒకాయన నేల మీద పడుక్కుని తీద్దామంటే, మరో ఆయన పైనుంచి వేళ్లాడుతూ తీస్తానంటాడు. ప్రతీసారీ యిల్లు మారలేదు కదా. ఇంటాయనను యిబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా వుందామనే దర్శకనిర్మాతలు చూస్తారు. కానీ యూనిట్‌లో వున్నవాళ్లందరూ ఒకలాటి వారు కాదు, ఒక స్థాయివారు కారు. ''సంపూర్ణ రామాయణం'' సినిమాకు ఎవరినో అడిగి పులిచర్మం తెస్తే, యూనిట్‌లో ఎవరో పులిగోళ్లు పీక్కు పోయారట. ఎంత ఖర్చయినా సరే, వాటిని రిప్లేస్ చేద్దామని రమణగారు వేలు ఖర్చు పెట్టి తెప్పించి అతికింపించారట. కానీ అతుకులు అతుకులుగానే వుండిపోయి, పులిచర్మం సొంతదారు నానా తిట్లూ తిట్టాడట. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన సీతారాముడుగారు ''కొసరు కొమ్మచ్చి''లో రాశారు – ''తెలుగులో అన్ని బూతులు వుంటాయని నేను వూహించలేదు'' అని.
సినిమాజనులు యిన్‌సెన్సిటివిగా వుంటారు కూడా. రావి కొండలరావుగారు ''హ్యూమరథం''లో రాశారు – ఓ మధ్యతరగతి యింటివాళ్లు తమ యిల్లు షూటింగుకి యివ్వడానికి ఒప్పుకున్నారు. మర్నాడు పొద్దున్నే తెల్లవారకుండా ప్రొడక్షన్ యూనిట్‌వాళ్లు కుండలు, తాళ్లు, వెదురు కఱ్ఱలు.. యిలా అంత్యక్రియలకు కావలసిన సరంజామా అంతా తెచ్చి యింటిముందు పెట్టేశారు. ఎందుకంటే అవేళ షూట్ చేయాల్సిన సీను చావుసీను. కెమెరా అవీ తొమ్మిది తర్వాత వచ్చాయి. ఈ లోగా యీ సామగ్రి చూసి ఆ యింట్లో ఎవరో పోయారనుకుని వీధిలోని వాళ్లందరూ పరామర్శకు వచ్చారు. ఇంట్లోవాళ్లకు సీనేదో ముందుగా తెలియదు. ఏదో సినిమా షూటింగంటే సరేనన్నారు. ఈ గొడవ చూసి ఒప్పుకోం పొమ్మన్నారు. ఇప్పటికిప్పుడు వేరే స్పాట్ ఎలా వెతుక్కోగలం అని యూనిట్ వాళ్ల గోల. ఆ ప్రొడక్షన్ వాళ్లు కెమెరాలతో బాటే యీ సరంజామా తెచ్చి వుంటే యీ అల్లరి జరిగేది కాదు. కానీ వాళ్లకు తోచదు. వాళ్లకు పని జరగడమే ప్రధానం.
కొన్ని గుహల్లో ఫ్లాష్‌తో లైట్లు తీయనీయరు – గోడలమీద బొమ్మలు చెడిపోతాయని. సినిమావాళ్లను యీ నిబంధనలు ఆపుతాయా? అక్కడ వున్న సెక్యూరిటీ గార్డుకు నచ్చచెప్పుకుని షూటింగు కానిచ్చేస్తారు. పార్కుల్లో అరుదైన మొక్కలు కూడా నాశనమయ్యే ప్రమాదం వుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో చేసే షూటింగులకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది. అవి ఎత్తేయాలని సినీజనులు కోరుతూంటారు. ఈ యిబ్బందులు లేకుండా వుండాలనే విజిపి గార్డెన్స్, రామోజీ ఫిలిం సిటీ వంటివి వెలిశాయి. కెమెరా మూవ్‌మెంట్స్‌కు అనువుగా వుండేట్లుగా ముందే ప్లాన్ చేసిన ప్రదేశాలవి. మరి 700, 800 ఏళ్ల క్రితం నాటి రాచకొండ కోటలు, గుహలు అలా ప్లాన్ చేసినవి కావు కదా. తమకు కావలసిన విధంగా వీళ్లు వాటిని మలచబోతే ధ్వంసమవుతాయేమో! ఉన్నదున్నట్టుగానే షూట్ చేస్తే ఓ పాతిక సినిమాలు అక్కడ తీసేసరికి ప్రేక్షకులకు లొకేషన్స్ బోరు కొడతాయి. ఆ బండలను, బురుజులను తిరగేసి, బోర్లేసి తీద్దామంటే కుదరదు కదా. కృత్రిమంగా కట్టినవైతే అలాటి గమ్మత్తులు చేయవచ్చు.
ఫిలిం సిటీ అంటూ రెండు వేల ఎకరాలు కట్టి సినిమావాళ్లందరికీ ఉదారంగా ప్లాట్లు యిస్తానంటే ఏమో కానీ, లేకపోతే సినీనిర్మాణానికైతే రాచకొండ గుట్టల జోలికి వెళ్లకుండా వుంటేనే మేలు. హైదరాబాదుకి దూరంగా ఎక్కడో కడితే రవాణా ఖర్చులు బోల్డు అవుతాయి. ఆ లాజిక్‌తోనే ఎన్టీయార్ ప్రభుత్వస్థలం నిరాకరించి గోల్కొండ చౌరస్తాలో సొంత స్థలంలో స్టూడియో కట్టుకున్నారు. బ్రహ్మానంద చిత్రపురి అనే పేరుతో గతంలో తలపెట్టిన పెద్ద ప్రాజెక్టు ఫెయిలయింది, వూరికి దూరంగా వుందన్న కారణం చేతనే! తెలంగాణ సినీనిర్మాతలను, కళాకారులను ప్రోత్సహిద్దామనుకుంటే కొత్తగా సిటీలు కట్టే బదులు నష్టాల్లో వున్న సినిమా స్టూడియోలను అద్దెకు తీసుకుని, వాటిని తక్కువ రేట్లపై వీరికి అందిస్తే అదే పదివేలు. సినిమా వ్యాపారంలో యీ రోజు వున్న ప్రధానమైన లోటు థియేటర్లు, స్టూడియోలు కాదు. హంగులు లేని థియేటర్లు విస్తృతంగా కట్టించి వినోదపు పన్ను మినహాయించి, తక్కువ రేట్లపై సినిమా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తే చిన్న సినిమాలు బతుకుతాయి. దానితో బాటు సృజనాత్మకతను తెరపై ఎలా ఆవిష్కరించాలో నేర్పే యిన్‌స్టిట్యూట్‌లు ప్రభుత్వం నెలకొల్పి ఔత్సాహికులకు తక్కువ ఫీజుతో నేర్పిస్తే చిత్రపరిశ్రమ వర్ధిల్లుతుంది. ఆ కళ నేర్చుకున్నవాళ్లు హ్రస్వచిత్రంతో కూడా అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తారు. అది లేకుంటే వూరంత ఫిలిం సిటీ లో తీసినా వారానికి మించి సినిమా ఆడదు. ఆ మాత్రం దానికి రాచకొండ రాచఠీవిని చెడగొట్ట నవసరం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)