ఇదీ మరీ బాగుంది మగధీరా?

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని వెనకటికి ఒక లైన్ వుంది. మగధీర వ్యవహారం అలాగే వుంది. ఈ మధ్య రాబ్తా అనే హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు మూలం మన మగధీరే.…

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని వెనకటికి ఒక లైన్ వుంది. మగధీర వ్యవహారం అలాగే వుంది. ఈ మధ్య రాబ్తా అనే హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు మూలం మన మగధీరే. వాళ్లు చాలా తెలివిగా, మగధీర కథను తమకు అనుకూలంగా మార్చుకుని సినిమా చేసేసారు. దీనిపై ఇప్పుడు కోర్డుకు వెళ్లారు మగధీర నిర్మాతలు. ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించమే అన్నది మగధీర నిర్మాతల వాదన. దీనిపై కోర్టు నోటీసులు జారీ చేసి, జూన్ ఒకటికి వాయిదా వేసింది.

అదంతా ఓకె. కానీ చిత్రమేమిటంటే, మగధీర కథ తన నవల నుంచి కోట్టేసారని పాపం, ఓ రచయిత అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు. ఆంధ్రభూమి మేగ్ జైన్ లో వచ్చిన తన చందేరి నవలను మగధీర కథగా మార్చేసారని అప్పట్లో రచయిత చారి కోర్టుకు వెళ్లారు. మరి ఆ కేసు ఏమయిందో తెలియదు. చిత్రంగా ఇప్పుడు మళ్లీ అదే మగధీర పై కేసు పడింది.

మగధీర కథలాగే వుంది. జన్మజన్మల బంధం మాదిరిగా కేసుల బంధం.