అనగనగా ఓ తండ్రి. కొడుకును కలెక్టర్ గా చూడాలని కోరిక. కూతురు కూడా వుంది. కానీ కూతురు కలెక్టర్ అయినా అత్తింటికి వెళ్లిపోతుంది అని, కొడుకే కలెక్టర్ కావాలని కోరుకుంటాడు. కానీ కూతురికీ కలెక్టర్ కావాలని కోరిక. అప్పుడా తమ్ముడు కావాలని త్యాగం చేస్తాడు.
అక్కని కలెక్టర్ గా చూడడం కోసం తాను సినిమా ఫైట్లలో డూప్ ఫైటర్ గా మారతాడు. సరిగ్గా చదవక, తండ్రి చేత మాటలు పడతాడు. కానీ అసలు వైనం అక్కని కలెక్టర్ గా చూడడం. . ఒక విధంగా అక్క కోసం త్యాగం చేసే తమ్మడి కథగా బోలెడు సెంటిమెంట్…అదే సమయంలో సినిమాల్లో డూప్ ఫైటర్ గా బోలెడు మాస్ వ్యవహారం.
ఇదీ రాబోయే ఓ పెద్ద హీరో సినిమా కథ లైన్ అని ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమాను ఆ మధ్య గట్టి దెబ్బతిన్న ఓ పెద్ద డైరక్టర్ రూపొందిస్తున్నారు. ఆ సినిమా కథ ఇదే అని పక్కగా తెలియాలంటే మరి కొంత కాలం ఆగాలి.