ఇక ఇప్పుడు ‘సీకాకులం’

తెలంగాణ ఉద్యమం ఊపందుకునే వరకు తెలంగాణ మాండలీకాన్ని వెటకారం చేయని తెలుగు సినిమా లేదన్నట్లు నడిచింది వ్యవహారం. హీరో ఆంధ్ర, విలన్ తెలంగాణ అన్నట్లు కథలల్లేవారు. తెలంగాణ జనం ఎప్పుడైతే కళ్లెర్ర చేయడం ప్రారంభించారో…

తెలంగాణ ఉద్యమం ఊపందుకునే వరకు తెలంగాణ మాండలీకాన్ని వెటకారం చేయని తెలుగు సినిమా లేదన్నట్లు నడిచింది వ్యవహారం. హీరో ఆంధ్ర, విలన్ తెలంగాణ అన్నట్లు కథలల్లేవారు. తెలంగాణ జనం ఎప్పుడైతే కళ్లెర్ర చేయడం ప్రారంభించారో అప్పుడు తగ్గారు. ఇప్పుడు ఆ లోటు తీర్చుకోవడానికి ఉత్తరాంధ్ర మాండలీకం మీద పడినట్లు కనిపిస్తోంది.

 కేరింత సినిమాలో శ్రీకాకుళం కుర్రాడు అంటే తెగ వెక్కిరించి వదిలిపెట్టారు. డిగ్ర్రీ పాసైనా గోల్ అంటే తెలియదు అన్నట్లుగా, పువ్వుల ష్టర్టులు, ఎర్ర ఫ్యాంట్లు,ఇలా చాలా ఎకసెక్కమే చేసారు కామెడీ పేరిట. పైగా హీరో బాగా చదువుకుని వచ్చిన తరవాత యాస మారిపోతుంది. అంటే చదువుకున్నవాళ్లు ఉత్తరాంధ్ర మాండలీకం ఇక మాట్లాడరనా? నిజానికి ఆంధ్రలో ఇప్పుడు శ్రీకాకుళం విద్య,ఉద్యోగాల పరంగా మంచి స్థానంలో వుంది. ఏదో ఒక సినిమాకు అయితే ఫరవాలేదు. అదే బాగుందని రిపీట్ చేయడం ప్రారంభిస్తే కష్టం. 

ఆంధ్ర జనాలు తెలంగాణ యాసను కామెడీ కి వాడుకుంటే అక్కడి వారికికోపం వచ్చంది. మరి తెలంగాణ నిర్మాత దిల్ రాజు, శ్రీకాకుళం యాసను కామెడీ కి వాడుకుంటే, ఉత్తరాంధ్ర వాసులు మాత్రం మౌనంగానే వున్నారు. గతంలో కూడా శ్రీకాకుళం యాసను కామెడీకే వాడుకున్నారు కొన్ని సినిమాల్లో. ఇది మరీ ఎక్కువ కాకుండా చూడడం మంచిది. లేదంటే ఆ ప్రాంతం వారి సహనానికి కూడా హద్దు వుంటుంది కదా.