ఎమ్బీయస్‌: ఆంధ్రులకు మసి పులమడం అన్యాయం- 1

రేవంత్‌ రెడ్డి వ్యవహారంలో టిడిపి తప్పటడుగులు కొనసాగిస్తోంది. నిజం చెప్పాలంటే యిప్పటి సంకటస్థితి అత్యంత జటిలమైనది. దీనిలోంచి లాఘవంగా, అతి తక్కువ నష్టాలతో బయటపడడం ఎవరికైనా కష్టమే. బాబు తన తెలివితేటలతో, తన సలహాదారుల,…

రేవంత్‌ రెడ్డి వ్యవహారంలో టిడిపి తప్పటడుగులు కొనసాగిస్తోంది. నిజం చెప్పాలంటే యిప్పటి సంకటస్థితి అత్యంత జటిలమైనది. దీనిలోంచి లాఘవంగా, అతి తక్కువ నష్టాలతో బయటపడడం ఎవరికైనా కష్టమే. బాబు తన తెలివితేటలతో, తన సలహాదారుల, న్యాయవాదుల ఉపాయాలతో ఎలా గట్టెక్కుతారా అందరూ ఉత్సుకతతో చూస్తున్న తరుణంలో ఆయనా, ఆయన పార్టీ సమస్యను క్లిష్టతరం చేస్తున్నారు. అనవసర విషయాలను దీనిలోకి లాగుతున్నారు, తమకు పట్టిన మసిని అందరికీ పులిమి, యిది యిరు రాష్ట్రాల మధ్య సమస్యగా, ఆంధ్రులకు అవమానంగా చిత్రీకరిద్దామని చూస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు స్ట్రాటజీ.

వీడియోలో రేవంత్‌ పట్టుబడి రెండు వారాలవుతోంది. ఇప్పటిదాకా రేవంత్‌ చర్యను సమర్థించడమో, వ్యతిరేకించడమో చేయలేదు. రేవంత్‌ యింట్లో నిశ్చితార్థానికి వెళ్లారు కాబట్టి… అని అర్థాలు తీయకూడదు. అది వ్యక్తిగతమైన కార్యక్రమం. ఆ టైములో పార్టీ సహచరుని కుటుంబానికి అండగా నిలవడం మానవత. రాజకీయంగా రేవంత్‌ పార్టీ ఆదేశాన్ని ధిక్కరించో, ముందుగా చెప్పకుండా తనంతట తానే వెళ్లడమో చేసి డబ్బుతో వెళ్లి వుంటే 'మాకు సంబంధం లేదు' అనే ప్రకటన రావాలి. రాలేదు, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లో, సంజాయిషీ కోరినట్లో కూడా ప్రకటన రాలేదు. అలా అని రేవంత్‌ చేసినదాన్ని సమర్థిస్తున్నారా అంటే ఆ దిశగానూ ప్రకటన లేదు. టిడిపి నాయకులు కెసియార్‌ ఫార్మ్‌హౌస్‌లో చేస్తే ఒప్పూ, మేం చేస్తే తప్పూ అయిందా వంటి వాదనలు మానలేదు. కెసియార్‌ చేసినది ఒప్పని ఎవరైనా అన్నారా? తెరాస నాయకులైనా మేం డబ్బు పెట్టి కొన్నాం, భయపెట్టాం అది ఒప్పు అని చెప్పారా? మా సిద్ధాంతాలు నచ్చి వాళ్లు వచ్చి చేరితే వద్దనాలా? అంటూ వాదించారు. ఎన్నికలకు ముందు, వెనకా టిడిపిలో చేరిన యితర పార్టీ నాయకులు డబ్బు తీసుకుని చేరారు, అది ఒప్పు అని ఎవరైనా అన్నారా?  

తెరాసకు తగినంత బలం లేకపోయినా అదనపు అభ్యర్థిని నిలబెట్టిందంటేనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్లాను చేసినట్లే అని వాదించడానికి లేదు. ఆ మాట కొస్తే టిడిపికీ తగినంత బలం లేదు, అయినా అభ్యర్థిని నిలిపింది కదా, వాళ్లు మాత్రం ఎలా గెలిపించు కుందామనుకున్నారట? ఇలాటి జూదం గతంలో టిడిపితో సహా అనేక పార్టీలు ఆడారు. పలుకుబడితోనో, ధనంతోనో అదనపు ఓట్లు తెచ్చుకుంటాడనే ఊహతోనే ధనిక పారిశ్రామికవేత్తలను కౌన్సిల్‌కు, రాజ్యసభకు నిలబెట్టిన సందర్భాలు అనేకం చూశాం. వాళ్లు గెలిచారంటే డబ్బు చేతులు మారిందని వూహిస్తాం తప్ప రుజువులు దొరకలేదు. ఇన్నాళ్లకు యిప్పుడు రేవంత్‌ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇతరులు చేశారు కాబట్టి నేనూ చేశా, తప్పేముంది, వాళ్లు పట్టుబడలేదు కాబట్టి పట్టుబడినా నన్ను వదిలేయండి అని ఏ ముద్దాయియైనా కోర్టులో వాదించగలడా?

రేవంత్‌ చేసినది వీడియోలో వచ్చేసింది కాబట్టి దాని గురించి నోరెత్తలేక పోతున్నారు కానీ ఆడియో టేపుల్లో చంద్రబాబు వాయిస్‌ గురించి ఏదేదో కవర్‌ చేద్దామని చూస్తున్నారు. మొదట్లో ఆ గొంతు చంద్రబాబుది కాదు, ఎవరో మిమిక్రీ ఆర్టిస్టుది అయి వుంటుంది అన్నారు. ఆ తర్వాత ఆ మాట ఎత్తడం మానేశారు. ఇప్పుడు తెరాస నాయకులు పదేపదే అడుగుతున్నారు – ఆ వాయిస్‌ తనది కాదని చెప్పమనండి చూదాం అని. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తే ఆ వాయిస్‌ ఒరిజినల్‌దో కాదో చెప్పేస్తారని బాబుకి ఎవరో చెప్పి వుంటారు. ఆయన తన వాయిస్‌ కాదని చెప్పడం మానేశారు. 'కట్‌ అండ్‌ పేస్ట్‌ చేసిన వాళ్లను అడుగు..' అని విలేకరిని గసరడం బట్టి అది తన గొంతే అనీ, వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినది కావాలని గుదిగుచ్చి అప్రదిష్టపాలు చేస్తున్నారనే లైన్‌ తీసుకున్నారు. అంటే మొదట చెప్పిన వాదన తప్పని తనే ఒప్పుకున్నట్టయింది. వేర్వేరు సందర్భాల్లో సంభాషణల్లో మాట్లాడినవి ఏరుకుని యీ అర్థం వచ్చేట్లు కిట్టింపు చేశారన్న లైన్‌ను నమ్ముకున్నా బాగుండేది. నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు అనే యింకో వాదన ముందుకు తెచ్చారు. 'నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు' అనగానే 'నేను అలా మాట్లాడినది వాస్తవం, అది నా గొంతు అన్నది వాస్తవం, మీరు ట్యాప్‌ చేసి నన్ను పట్టేసుకున్నారు' అని ఒప్పుకున్నట్టు అయింది. 

దీనికి ఒక రైడర్‌ ఏమిటంటే – కట్‌ అండ్‌ పేస్ట్‌ పనికి మీరు ఏరుకున్న సంభాషణా శకలాలు నేను వేర్వేరు వ్యక్తులతో మాట్లాడినవి, యీ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినవి కాదు అని వాదించే అవకాశం వుంది. 'మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ.. ఐ యామ్‌ విత్‌ యూ.. డోంట్‌ బాదర్‌… వాట్‌ ఆల్‌ దే ప్రామిస్‌డ్‌, విల్‌ బి ఆనర్‌డ్‌.. దటీజ్‌ అవర్‌ కమిట్‌మెంట్‌' వంటి వాక్యాలు ఏదో రహస్య చెల్లింపులు, ఒప్పందాలకు సంబంధించిన సంభాషణ లాగానే వుంది. ఏ పారిశ్రామిక వేత్తతోనో పెట్టుబడులు ఆహ్వానిస్తూ చేసిన సంభాషణలా లేదు.
ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదు, చేయలేదు అని తెలంగాణ నాయకులు, ఎసిబి చీఫ్‌ ఖాన్‌ అందరూ చెప్తున్నారు. మామూలుగా ఆలోచించి చూస్తే తన ఫోన్‌ లోంచి యిలాటి డీల్స్‌ మాట్లాడే పిచ్చిపని ఏ నాయకుడూ చేయడు. ముఖ్యంగా కమ్యూనికేషన్లపై విపరీతమైన నిఘా వున్న యీ రోజుల్లో! ఎవరు ఎవరితో, ఎంతసేపు మాట్లాడారన్నది కాల్‌ డేటాలో వచ్చేస్తోంది. ఏ నాయకుడైనా సరే రాయబారుల చేత కబురు పంపిస్తారు. అవతలివాళ్లు మరీ హామీ కోరితే అనుచరుడి ఫోన్‌లోంచి మాట్లాడతారు. అలాటిది బాబు తన వ్యక్తిగత ఫోన్‌లోంచో, అఫీషియల్‌ ఫోన్‌లోంచో యిలాటి సంభాషణ చేశారంటే నమ్మలేం. అవతలివాళ్లు మాట్లాడితే తన ఫోన్‌లో ఆ సంభాషణను రికార్డు చేసే సౌకర్యం చాలా ఫోన్లలో వుంది. స్టీఫెన్‌సెన్‌ వద్ద అలాటి ఫోన్‌ వుందనుకుంటే, బాబును యిరికిద్దామనే ప్లానుతో అతనా సంభాషణను రికార్డు చేశాడనుకుంటే విషయం సింపుల్‌గా అర్థమవుతుంది. 

అలా కాకుండా బాబు ఫోన్‌ను ట్యాప్‌ చేశారు అని ఆరోపిస్తే దాన్ని నిరూపించడం చచ్చే కష్టం. 'బాబు సంభాషణలు మా వద్ద చాలా వున్నాయి' అని నాయిని అన్న స్టేటుమెంటు ఆధారంగా ట్యాప్‌ జరిగిందని నిర్ధారించలేం. స్టీఫెన్‌సన్‌ ఒక్కడి ఓటుతో టిడిపి అభ్యర్థి గెలవలేడు కాబట్టి యింకా కొంతమందితో బాబు మాట్లాడి వుండవచ్చు, వారిని కూడా పురికొల్పి ఆ సంభాషణలు రికార్డు చేయించి వుండవచ్చు. నాయిని చెప్పిన 'మరిన్ని ఆడియో రికార్డింగులు..' అవే కావచ్చు. నిజానికి బాబు ఫోన్‌ కనక ట్యాప్‌ చేయగలిగి వుంటే, ఆయన యిలాటివి, మరో లాటివి వ్యవహారాలన్నీ ఆ ఫోన్ల ద్వారానే మాట్లాడుతూ వుంటే ఆంధ్ర రాష్ట్రం గుట్టుమట్లన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతిలో వున్నట్లే. ఈ విషయాన్ని యిప్పటిదాకా తెలుసుకోలేకపోవడం ఆంధ్ర పోలీసుల, యింటెలిజెన్సు విభాగం వైఫల్యం. ముందు వారికి దండన వేయాలి.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]