టాలీవుడ్ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా వుంది. దానికి మూలమైన సవాలక్ష కారణాల్లో శాటిలైట్ సమస్య ఒకటి. ట్రాయ్ నిబంధనల కారణంగా శాటిలైట్ రేట్లు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ , చిన్న సినిమాలను ఇది బాగా దెబ్బతీసింది. మరోపక్క పెరుగుతున్న రేట్లు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తోంది. ఆటో ధరలు, థియేటర్ టికెట్ ధరలు, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఫుడ్ ధరలు ఇలా ఒకటేమిటి? అన్నీ. ఇదిలావుంటే గతంలో మూడు నెలల తరువాత కానీ కొత్త సినిమాలు టీవీల్లో వచ్చేవి కాదు.
కానీ ఇప్పుడు పైరసీ సీడీ వారంలో మార్కెట్ లోకి వచ్చేస్తోంది. వాటిని అరికట్టడం అన్నది దాదాపు అసాధ్యమైపోయింది. ఇక నెట్ లో ప్రత్యక్షం కావడం అన్నది కామన్ అయింది. దీని కోసం నిర్మాతలు అదనపు ఖర్చు పెట్టుకుని నెట్ ను జల్లెడ పట్టడం అన్నది తప్పడం లేదు. వారం కాగానే నిర్మాత కూడా ఇక చేతులు ఎత్తేసి ఊరుకుంటున్నారు. బోలెడు డబ్బులు ఇచ్చి హక్కలు కొంటే, నెల నాటికి మాంచి ఒరిజినల్ పైరసీ ప్రింట్ మార్కెట్ లోనో, నెట్ లోనో వుంటే ఇక టీవీలో మూడు నెలల తరువాత ఎవరు చూస్తారు?
అందుకే టీవీల్లో కూడా ఇప్పుడు నెలకే వేసేస్తున్నారు. గీతాంజలి, పాఠశాల ఇలా చాలా సినిమాలు త్వరగా టీవీల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు నాగచైతన్య లేటెస్ట్ సినిమా ఒక లైలా కోసం ఈ వారాంతంలోనే ప్రదర్శిస్తున్నట్లు మా టీవీలో ప్రదర్శిస్తున్నట్లు అప్పడే ప్రకటనలు మొదలయ్యాయి.
ఈ సినిమా గత నెల 17న విడుదలైంది. సుమారు ఆరు కోట్లకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు మాటీవీ తీసుకుంది. ఇంకాచాలా సెంటర్లలో ఆడుతోంది. 23న టీవీలో ఇస్తారంటే, వారం ముందుగా ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దాని ప్రభావం కలెక్షన్లపై కచ్చితంగా పడుతుంది.
రాను రాను సినిమా ఆడే స్పాన్ తగ్గిపోతోంది. నెలల నుంచి వారాలకు, ఆఖరికి వారానికి వచ్చింది. ఇప్పుడు మూడు రోజుల్లో ఎంత వస్తే అంత అన్నట్లు తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లొ టీవీలో ఇలా నెల లోపే ఇస్తే, ఫ్యామిలీలు ఇక చాలా వరకు థియేటర్లకుదూరం అయ్యే ప్రమాదం వుంది.