ఇంకెందుకు.. జగన్ కు సారీ చెప్పేయండి

తెలుగుదేశం ఎంపీ సిఎమ్ రమేష్ వ్యాపారాల మీద.. ఆదాయపన్ను శాఖ రెయిడ్స్ జరిగిన మరుక్షణం మంత్రి నారాలోకేష్ ట్విట్టర్ లో చెలరేగిపోయారు. ఇదంతా కుట్ర అని, కడప ఉక్కుకోసం దీక్షచేసిన ఫలితం అని, ఇంకా…

తెలుగుదేశం ఎంపీ సిఎమ్ రమేష్ వ్యాపారాల మీద.. ఆదాయపన్ను శాఖ రెయిడ్స్ జరిగిన మరుక్షణం మంత్రి నారాలోకేష్ ట్విట్టర్ లో చెలరేగిపోయారు. ఇదంతా కుట్ర అని, కడప ఉక్కుకోసం దీక్షచేసిన ఫలితం అని, ఇంకా చాలా చాలా ట్వీట్లు చకచకా చేసేసారు. అసలు టోటల్ గా ఆదాయపన్ను దాడులు అన్నీ రాజకీయ కుట్ర తప్ప వేరుకాదన్నారు. అంతా బాగానే వుంది. దీనికి అనుకూలంగానే తెలుగుదేశం అను'కుల' మీడియా వార్తలు, కథనాలు వండి వార్చింది.

వీటన్నింటిని చదివితే కొన్ని పాయింట్లు అర్థం అవుతాయి.

సిబిఐ, ఐటి, ఈడి లాంటి కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో వుంటాయి. 

కేంద్రం ఈ సంస్థలను తన రాజకీయ కక్షల కోసం వాడుకుంటుంది.

కాంగ్రెస్ కావచ్చు, భాజపా కావచ్చు, మరే ఇతర పార్టీదైనా ఇదే తీరు.

అంతే కదా?

లోకేష్ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇన్నాళ్లు జగన్ ను వెంటాడుతూ, చీల్చి చెండాడుతూ, ఇప్పుడు మోడీ చేస్తున్నది అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం అను'కుల' మీడియా చాటింపు వేస్తున్నది.

మరి వీళ్లు ఎందుకు ఒప్పుకోవడం లేదు. సోనియా ఆదేశాలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మీద సిబిఐని, ఈడీని ఉసి గొలిపింది అని?

అంటే జగన్ పైకి, అతగాడి సంస్థల పైకి ఈడీ, సిబిఐ వస్తే, అది జగన్ చేసిన నేరాల విచారణ. తెలుగుదేశం నాయకుల ఇళ్లపైకి, వ్యాపారాలపైకి వస్తే, అది రాజకీయ కక్షసాధింపు.

ఈ రెండు స్టేట్ మెంట్లలో ఒకటే నిజంకావాలి. ఎందుకంటే జగన్ కూడా రాజకీయ నాయకుడే. పైగా సోనియాను ఎదిరించినవాడు. వేరే పార్టీ దిశగా వెళ్లినవాడు. అప్పట్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టిన వాడు.

మరి ఎంతవరకు పాజిబులిటీ వుంటుంది జగన్ మీద సిబిఐని, ఈడీని కేంద్రం ఉసి గొలపడానికి. ఆలోచించండి.

అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం జనాలు జరుగుతున్న ఈడి, ఐటి వ్యవహారాలపై మోడీని కార్నర్ చేయాలంటే, ముందుగా జగన్ కు సారీ చెప్పేయాలి. అప్పట్లో తమకు నిజం తెలియక జగన్ ను నిందించామని, రాజకీయ బాధితుడు అని ఇఫ్పుడు అర్థం అయిందని చెప్పి, అప్పుడు తమ నిందారోపణలు మొదలుపెట్టాలి.

లేదూ అంటే, జగన్ కు ఓ నీతి, తమకు ఓ రీతి అని ఒప్పుకోవాలి.