'నోటా' ఫ్లాపవడాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్నారని విజయ్ దేవరకొండ ఆరోపించడం సంచలనమైంది. దానికితోడు అతను ఆ మాట అన్న మరునాడే అతనిపై హీరో నిఖిల్ సెటైర్లు వేసాడు. తనని తాను ఎక్కువ ఊహించుకోవడం తగదనే రీతిన మాట్లాడాడు. 'ఇప్పుడే పండగ చేసుకోండి… ఎందుకంటే మళ్లీ నేను వస్తా' అంటూ సవాల్ చేసిన విజయ్‌కి నిజంగా నోటా వల్ల డ్యామేజ్ జరిగిందా?
'నోటా' ఫలితం ఏమిటనేది దాదాపుగా విడుదల కాముందే చాలా మంది గెస్ చేసారు. కాకపోతే విజయ్ దేవరకొండని సరిగా వాడుకుంటే ఆ రెబల్ పొలిటీషియన్ ఆకట్టుకుంటాడేమో అనే డౌట్ వుండేది. కానీ తమిళ దర్శకుడు ముందుగా ఊహించినట్టుగానే ఎటూ కాని పొలిటికల్ సినిమా తీసాడు. విజయ్‌కి అత్యంత ఆదరణ వున్న యూత్, ఫ్యామిలీ వర్గాలని ఆకట్టుకునే కాన్సెప్ట్ కాదు కనుక ఖచ్చితంగా దీని రేంజ్ తక్కువే వుంటుందని ముందే భావించారు.
మాస్‌ని కూడా ఆకట్టుకోకపోవడం, పాటలు లేకపోవడం, హీరోయిన్ కూడా లేకపోవడంతో నోటా పెద్ద ఫ్లాప్ అయింది. కానీ ఇది విజయ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసి అతని తదుపరి చిత్రాలని ప్రభావితం చేసే ఫలితమయితే కానే కాదు. అతను అర్జున్ రెడ్డి లేదా గీత గోవిందం లాంటి చిత్రం చేసి ఫెయిలయితే వర్రీ కావాలి కానీ ప్రయోగం వికటిస్తే వచ్చే నష్టమేం లేదు. కనుక విజయ్‌తో పాటు అందరూ చిల్!