జనం కోరింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా? ఇదే ఇప్పుడు క్రియేటర్ల ముందు వున్న క్వశ్చను. దర్శకుడు పూరి జగన్నాధ్ మొదటిదే ఎంచుకున్నారు. జనానికి కావాల్సింది ఇచ్చేస్తే పోలా? అని అనుకున్నారు. కసిగా ఓ మాస్ సినిమా తీసారు. దాంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా కుమ్మిపడేస్తోంది కలెక్షన్లు.
తొలివారం ముగిసిన తరువాత డియర్ కామ్రేడ్ కాస్త బ్రేక్ వేస్తుంది అనుకున్నారు అంతా. శుక్రవారం, శనివారం కాస్త ఆ ట్రెండ్ కనిపించింది కానీ, సండే నుంచి మళ్లీ ఇస్మార్ట్ శంకర్ హవా స్టార్ట్ అయిపోయింది. డియర్ కామ్రేడ్ ఫుల్స్ రావడంలేదు కానీ ఇస్మార్ట్ శంకర్ ఫుల్స్ కనిపిస్తున్నాయి.
మండే కూడా అదే ట్రెండ్ కొనసాగింది. చాలా ఏరియాల్లో దాదాపు సమానంగా ఇస్మార్ట్ షేర్ వసూలు చేస్తోంది. గుంటూరులో నాల్గవరోజు కామ్రేడ్ కు 1,35,337 షేర్ వస్తే, అదే ఏరియాలో 12వ రోజు ఇస్మార్ట్ శంకర్ కు 1,24,762 షేర్ వచ్చింది. కృష్ణాజిల్లాలో నాల్లవరోజు కామ్రేడ్ 3.08 లక్షలు వసూలు చేస్తే, ఇస్మార్ట్ 2.78 లక్షలు షేర్ లాగింది. విశాఖలో కామ్రేడ్ షేర్ నాలుగోరోజు ఆరులక్షల మేరకు జారిపోయింది. ఇస్మార్ట్ షేర్ కూడా దీనికి దగ్గరగానే వుంది.
కామ్రేడ్ కు వచ్చిన డివైడ్ టాక్ ఇస్మార్ట్ కు పనికి వచ్చిందని, ఇండస్ట్రీలో ఇది కామన్ అని డిస్ట్రిబ్యూటర్ లు చెబుతున్నారు. ముఖ్యంగా బి,సి సెంటర్లు, సింగిల్ థియేటర్లు ఇస్మార్ట్ కు కలిసివస్తున్నాయి. కామ్రేడ్ కు క్లాస్ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు అండగా వుంటున్నాయి. అనుకున్న తేదీకి అంటే జూలై 12నకు ఇస్మార్ట్ వచ్చి వుంటే ఈ సమస్య కాస్త తగ్గి, కామ్రేడ్ కలెక్షన్లు మరి కాస్త బాగుండేవేమో?