కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, దేశమంతా విస్తృతంగా ఉన్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మంగళూరు సమీపంలో ఆయన కనపడకుండా పోయినట్టుగా సమాచారం. డ్రైవర్ తో కలిసి సిద్ధార్థ వెళ్లారట. కారును పార్క్ చేసి ఉంచమని, తను కాసేపు వాకింగ్ చేస్తానంటూ నదీ తీరంవైపు వెళ్లిన సిద్ధార్థ మళ్లీ కనిపించలేదని వార్తలు వస్తున్నాయి.
ఆయన నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా కూడా పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. కొన్నాళ్లుగా సిద్ధార్థ పేర్లు వార్తల్లోకి ఎక్కువగా వచ్చింది. కేఫ్ కాఫీడే ఓనర్ గా, ఆయన ఇంటిపై ఐటీవర్గాల దాడులతో ఆయన పేరు మార్మోగింది. ఆ రైడ్స్ జరిగిన కొంతకాలానికి ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరారు.
బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యతా పొందడంలేదు ఎస్ఎం. అయినా ఆ పార్టీలోనే మిగిలిపోయారు. ఎస్ఎం కృష్ణ అల్లుడు అదృశ్యం కావడంపై కర్ణాటకలో గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు కృష్ణ ఇంటికి చేరుకుని ఓదారుస్తున్నారు.