తమిళ స్టార్ హీరో విజయ్ ను ఐటీ శాఖ విచారించడంలో రాజకీయ కోణమే హైలెట్ అవుతూ ఉంది. ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి విజయ్ ని అధికారులు విచారిస్తూ ఉండటం అంతా రాజకీయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇటీవలే రజనీకాంత్ కు ఐటీ శాఖ ఏదో ఊరట ఇచ్చింది. గతంలో ఆయన ఐటీ ఫాల్ట్ కు సంబంధించిన వ్యవహారాన్ని ఇటీవలే క్లియర్ చేశారు. ఇక రజనీకాంత్ పారితోషకం వివరాలు కూడా అందరి హీరోల్లా రహస్యలే. అయితే ఉన్నట్టుండి విజయ్ మీద ఐటీ శాఖ పడింది.
ఇదంతా బీజేపీ స్కెచ్ అని తమిళనాడు రాజకీయ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పటికే విజయ్ ను విజయ్ జోసెఫ్ అంటూ కమలం పార్టీ వాళ్లు ఒకసారి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై చిన్నపాటి సెటైరిక్ డైలాగులు పెట్టినప్పుడు విజయ్ ను వారు విమర్శించారు. ఇక తమిళనాడు పార్టీ అన్నాడీఎంకేకు కూడా విజయ్ అంటే ఏ మాత్రం పడటం లేదని స్పష్టం అవుతోంది.
ఇక రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ మీద బీజేపీ ఆశలున్నాయి. ఇక విజయ్ కు కూడా పొలిటికల్ యాంబీషన్స్ ఏవో ఉన్నట్టే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు సమయం ఆసన్నం కాకముందే అతడిని దెబ్బతీసేందుకు, ఆర్థిక నేరగాడిగా చిత్రీకరించేందుకు ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని తమిళనాడు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటీకే బీజేపీ రజనీకాంత్ ను దారిలో పెట్టుకుందని, ఇప్పుడు విజయ్ ను కూడా అలా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని వారు అంటున్నారు. ఇక పలు తమిళ సంఘాలు కూడా అదే మాటే అంటున్నాయి. విజయ్ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని అంటున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇంకా ఎవరి మీదా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మరి లోగుట్టు ఏమిటో!