జెఎసి కాదు.. జెఎఫ్సీ అంట

ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ కావాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ అడుగు ముందుకు వేసిన సంగతి తెలిసిందే. ఆయన తనంతట తానుగా రెండు పేర్లు సజెస్ట్…

ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ కావాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ అడుగు ముందుకు వేసిన సంగతి తెలిసిందే. ఆయన తనంతట తానుగా రెండు పేర్లు సజెస్ట్ చేసారు. ఒకటి లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్, రెండవ పేరు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, ఆ కమిటీలో ఎవరు వుంటే బాగుంటుందో అన్నది ఓ ట్వీట్ ద్వారా తెలియచేసారు పవన్ కళ్యాణ్.

అయితే కొత్తగా జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే పేరును పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురావడం ఆశ్చర్యకరం. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే పోరాట బాటకు సంబంధించింది. కేంద్రం అన్యాయం చేసింది కాబట్టి పోరాడి న్యాయం సాధించేందుకు ఉద్దేశించింనది. కానీ జెఎఫ్సీ అలా కాదు. మరి ఇంతకీ ఇది జేఎసికి అదనమా? దానికి బదులుగానా?

అసలు జేఎసి ప్రకటించే ముందుగానే జెఎఫ్సీ ప్రకటించాలి. జెఎఫ్సీలో కేంద్రం అన్యాయం చేసింది అని తేలితేనే జెఎసి అవసరం అవుతుంది. కేంద్రం అన్యాయం చేయలేదు అని తేలితే ఇక జెఎసి అనవసరం. అదీ కాక, జెఎఫ్సీ ప్రకటించడం, మేధావులను ఆహ్వానించడం అంటే పవన్ కూడా బాబుగారి శీలాన్ని శంకించడమే.

కేంద్రం ఇవ్వడం లేదని అంటున్నారు బాబు అండ్ కో. పైగా పవన్ కూడా గతంలో కేంద్రం పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నారు. ఎంపీలకు సాధించడం చేతకావడం లేదన్నారు. కానీ ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే కేంద్రం ఇవ్వలేదన్న అనుమానం వున్నట్లు.

నిజానికి పవన్ ఈ జెఎఫ్సీనే ముందుగా ప్లాన్ చేసి వుంటే బాగుండేది. పోరాట బాట అని చెప్పి, ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే కాలయాపన వ్యవహారంగా కనిపిస్తుంది తప్ప వేరు కాదు. పైగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎలా సాధ్యం? రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలు సమగ్రంగా ఈ జెఎఫ్సీ ముందు వుంచాలి కదా? యుటిలిటి స్టర్టిఫికెట్ లే ఇవ్వడం లేదు. జెఎఫ్సీకి వివరాలు ఇస్తారా?

అందువల్ల జెఎసి కాదని పవన్ పక్కకు వెళ్లి జెఎఫ్సీ అంటే కాస్త అనుమానించాల్సిందే.