సినిమా రివ్యూ: తొలిప్రేమ

రివ్యూ: తొలిప్రేమ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తారాగణం: వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా, సప్నాపబ్బి, ప్రియదర్శి, హైపర్‌ ఆది, సుహాసిని, నరేష్‌ తదితరులు కూర్పు: నవీన్‌ నూలి సాహిత్యం:…

రివ్యూ: తొలిప్రేమ
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా, సప్నాపబ్బి, ప్రియదర్శి, హైపర్‌ ఆది, సుహాసిని, నరేష్‌ తదితరులు
కూర్పు: నవీన్‌ నూలి
సాహిత్యం: శ్రీమణి
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి. విలియమ్స్‌
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018

వెన్‌ ఆది మెట్‌ వర్షా…! 

'వెన్‌ హారీ మెట్‌ శాలీ' కథలానే ఇది కూడా ఒక జంట జీవితాల్లో వివిధ దశల్లో వచ్చి చిగురించే 'ప్రేమ' కథ. ప్రేమలో పడి, విడిపోయి… మళ్లీ కలిసి, ఆ తర్వాత బ్రేకప్‌ అయి… ఇంకెన్నాళ్లకో కలిసి అపార్ధాలు తొలగి ఒక్కటయ్యే జంట కథ. పలుమార్లు తెలుగు తెరపైనే కాక వివిధ భాషల్లో చూసిన కథే ఇది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కథని తనదైన పద్ధతిలో చెప్పాడు.

ఏదైనా అనిపిస్తే చేసేసే కుర్రాడు ఆది (వరుణ్‌). ఒక క్షణం ఆగి, ఆలోచించి నిర్ణయం తీసుకునే టైప్‌ వర్ష (రాశి). ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ చిన్న గొడవ పెద్ద రాద్ధాంతంగా మారుతుంది. అభిప్రాయాలు క్లాష్‌ అవుతాయి. 'ఐ హేట్‌ యూ' అని అమ్మాయి అనేస్తే, 'ఇంకోసారి ఆలోచించుకుని తిరిగి వచ్చినా నేనుండను' అంటూ అతను వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ అనుకోకుండా కలుస్తారు. అక్కడ్నుంచి ఏమవుతుందనేది ఇన్ని ప్రేమకథలు చూసిన అనుభవంలో ఎవరైనా ఊహించవచ్చు.

ఈ ప్రేమకథని మొదలు పెట్టడంలో, తన జంటని ప్రేమలో దించడంలో, ఆ కథని ముందుకి తీసుకెళ్లడంలో, తొలిముద్దు కంచెని తెంచడంలో (కార్‌లో జరిగే ఈ సీన్‌ హైలైట్‌), అభిప్రాయ బేధాలతో విడిపోవడంలో దర్శకుడు ఎంతో వినూత్నంగా తీర్చిదిద్దాడు.

ఈ పార్ట్‌పై ఎంత కమాండ్‌ చూపించాడంటే కనీసం హ్యూమర్‌ కోసం కూడా పక్కకి వెళ్లాల్సిన పని లేకుండా సన్నివేశాల్లోనే హాస్యాన్ని భాగం చేసాడు (విద్యుల్లేఖా రామన్‌తో 'అక్క' ఎపిసోడ్స్‌). 'బ్రేక్‌' వరకు బ్రేకుల్లేకుండా సాగిపోయిన ఈ లవ్‌స్టోరీ ఆ తర్వాత మాత్రం బ్రేక్‌ కోసం ఎదురు చూసే విధంగా సా…గింది. అంతవరకు నిలువెల్లా తొణికిసలాడిన కొత్తదనం ఒక్కసారిగా ముఖం చాటేసి, హైపర్‌ ఆది, నరేష్‌ క్యారెక్టర్ల రూపంలో కామెడీ సపోర్ట్‌ కోసం వెతుక్కునేట్టు చేసింది.

విడిపోయిన జంట మళ్లీ ఒక చోట కలిసినపుడు ఏదో ఒక రోజు వారిమధ్య విబేధాలు పోయి ఒక్కటవుతారనేది ఎవరైనా ఊహించేదే. కాకపోతే ఈ ముగింపుని చేరే వరకు చేయించిన ప్రయాణం ఏదైతే వుందో దాంట్లోను కొత్తదనం లోపించడమే కాకుండా చాలా బాగా తెలిసిన, చాలా సార్లు చూసిన సెటప్‌లా అనిపించేట్టు చేస్తుంది. ద్వితియార్ధంలో ఎమోషనల్‌ హైస్‌ లేకపోవడం ఈ సినిమా స్థాయిని పరిమితం చేస్తుంది. ప్రథమార్ధంలో ఆనాటి 'తొలిప్రేమ'లా మరో ట్రెండ్‌సెట్టర్‌ అయ్యేట్టు కనిపించిన ఈ 'తొలిప్రేమ' ముగిసే సమయానికి చాలా ప్రేమకథల్లో ఒకటిగా మిగిలిందే తప్ప 'మరపురాని' ప్రేమగాధల సరసకి చేరలేకపోయింది.

'మనుషులం అంకుల్‌… ప్రేమ గుర్తుండదు, కోపాలే గుర్తుంటాయి' అంటూ నరేష్‌కి రాశి చెప్పిన మాటతో కనక్ట్‌ అయి వరుణ్‌ పంతం వీడే సీన్స్‌ లాంటివి మరికొన్ని వుండాల్సింది. ఒక దశకి చేరిన తర్వాత 'కూర్చుని మాట్లాడుకుంటే' పరిష్కారమైపోయే సమస్యని అవసరం లేకుండా పొడిగిస్తోన్న భావన కూడా కలుగుతుంది.

ద్వితియార్ధంలో ఇద్దరూ ఒకే చోట వుండాల్సిన సందర్భం, వారి మధ్య చోటు చేసుకునే సంఘటనలు అన్నీ కన్వీనియంట్‌గా, సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప ఫస్ట్‌ హాఫ్‌లో వున్న సహజత్వం కానరాదు. పర్సనాలిటీ క్లాష్‌ అనే పాయింట్‌ని ఎక్కువ స్ట్రెస్‌ చేయకుండా సింపుల్‌గా, సేఫ్‌గా ముందుకు తీసుకెళ్లిపోవడం ఒకింత వెలితే.

ఇక ప్రేమ జంటగా వరుణ్‌, రాశి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. నటుడిగా ప్రతి సినిమాకీ పరిణితి చూపిస్తోన్న వరుణ్‌ ఎమోషన్స్‌ పండించడంలో రాణిస్తున్నాడు. ఫిదా కంటే కూడా ఇందులో ఇంకా మంచి పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇంత కాలం వీక్‌ అనిపించుకున్న డాన్సుల్లోను రాణించి, ఈజ్‌ చూపించి తన బలహీనతలపై కూడా వర్క్‌ చేసే కసి వుందనిపించుకున్నాడు. రాశి ఖన్నా మంచి నటి అయినా కానీ తన టాలెంట్‌కి న్యాయం చేసే పాత్రలు ఎక్కువ రాలేదు. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. ఆది, ప్రియదర్శి కంటే కూడా విద్యుల్లేఖ క్యారెక్టర్‌తో ఎక్కువ కామెడీ పండింది.

తెరపైనే కాకుండా తెరవెనుక నుంచి కూడా కొత్త దర్శకుడికి పూర్తి సహకారం అందింది. తమన్‌ అందించిన వీనులవిందైన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. పాటలన్నీ వినడానికే కాక చూడ్డానికి కూడా బాగున్నాయి. ఈ వర్షానికి స్పర్శ వుంటే.. లాంటి పాటలు చిరకాలం గుర్తుండిపోతాయి. జార్జ్‌ సి. విలియమ్స్‌ కెమెరా పనితనం మరో పెద్ద ఎస్సెట్‌. కలర్‌ఫుల్‌ విజువల్స్‌ అటుంచితే, ఎమోషన్స్‌ని క్లోజప్‌ షాట్స్‌తో క్యాప్చర్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడు వెంకీలో ఆల్‌రౌండ్‌ రైటర్‌ వున్నాడు.

మంచి సంభాషణలతో పాటు చక్కని సన్నివేశాలని కూడా రాసుకుని తన సామర్ధ్యం చాటుకున్నాడు. హీరోకి హీరోయిన్‌ తన ప్రేమని తొలిసారిగా వ్యక్తం చేసే సీన్‌ అతడి ప్రత్యేకత తెలుస్తుంది. అలాగే ఫస్ట్‌ కిస్‌ సీన్‌ని తెరకెక్కించిన విధానం దర్శకుడిగా అతడి ప్రతిభని చూపెడుతుంది. ఇంత టాలెంట్‌ చూపించిన ఇదే దర్శకుడు ద్వితియార్ధంలోకి వచ్చేసరికి ఎందుకు రొటీన్‌ బాట పట్టాడనేది కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. హీరోయిన్‌ని వదిలేసి పోయిన వెంటనే అక్కడికి రౌడీలు రావడం, వెంటనే హీరో వచ్చి ఫైట్‌ చేయడం లాంటి చాలా 'సాధారణ' సన్నివేశాలు ద్వితియార్ధంలో ఆసక్తిని హరించేస్తాయి.

తొలిప్రేమలో బలహీనతలున్నా కానీ అలరించే తొలి అర్ధభాగం, పసందైన సంగీతం, వరుణ్‌-రాశిల అభినయం వెరసి ఈ చిత్రాన్ని ప్రేమకథా చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులకి దగ్గర చేస్తాయి. ఫిదా తర్వాత ఇంకోసారి ప్రేక్షకులని మెప్పించే అవకాశాన్ని, బాక్సాఫీస్‌ని గెలుచుకునే వీలునీ వరుణ్‌తేజ్‌కి తొలిప్రేమ కల్పిస్తుంది.

బాటమ్‌ లైన్‌: అలరించే తొలిప్రేమ!

– గణేష్‌ రావూరి