సాంకేతికంగా తెలుగు సినిమాని ఎప్పటికప్పుడు ఓ మెట్టు పైకి ఎక్కిస్తూ వెళుతున్నాడు రాజమౌళి. అతి తక్కువ వ్యయంతో `మగధీర` సినిమాని తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. `ఈగ` సినిమా చూశాక మొత్తం ప్రపంచమంతా జక్కన్న గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంది.
కేన్స్‌లో ఆ సినిమా చూసి పొగడని నోరు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తీస్తున్న `బాహుబలి`లో ఇంకెన్ని అద్భుతాలున్నాయో తెలియదు. అయితే…. ఈ చిత్రం తర్వాత జక్కన్న ఓ త్రీడీ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాన్ని కూడా తక్కువ బడ్జెట్‌లోనే తీయాలని ప్లాన్ చేశారట. ఇప్పటిదాకా తెలుగులో రెండు త్రీడీ సినిమాలొచ్చాయి. కానీ వాటితో పెద్దగా ఫలితం రాలేదు.
అందుకే తాను త్రీడీ సినిమా తీసి సక్సెస్ కొట్టాలని రాజమౌళి అభిప్రాయపడుతున్నాడట. టెక్నికల్‌గా తదుపరి నిరూపించుకోవడానికి ఇంతకంటే మరోమార్గం లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ త్రీడీ సినిమాలో హీరో ఎవరన్న విషయమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే.. `బాహుబలి` తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తానని జక్కన్న ఇదివరకు మాటిచ్చాడు. మరి త్రీడీ సినిమాలో ఆయనే నటిస్తాడా లేదంటే మరొక కథానాయకుడిని ఎంచుకొంటాడా అన్నది చూడాలి.