ప్రజలకు న్యాయం చేస్తాడో లేదో.. ముందైతే, రెండేళ్ళ క్రితం స్థాపించిన జనసేన పార్టీకి ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ న్యాయం చేయాల్సి వుంది. ఎందుకంటే, పార్టీ పెట్టేశాం.. జెండా చూపించేశాం.. ఆ తర్వాత వదిలేశాం.. అన్నట్టుంది వ్యవహారం ఇప్పటిదాకా. గుర్తుకొచ్చినప్పుడు పవన్‌కళ్యాణ్ పొలిటికల్ షోలు చేస్తుంటారు. ఆ సమయంలో అభిమానులు జనసేన జెండాల్ని బయటకు తీస్తారు. మళ్ళీ ఆ తర్వాత, అవి బూజుపట్టి, చిరిగిపోతాయంతే.
రెండేళ్ళుగా జరుగుతున్న తంతు ఇదే. పోన్లెండి, జనసేన జెండాల ఖర్చు తగ్గింది.. అని ఎవరెన్ని వెటకారాలు వేసినా, పవన్‌కళ్యాణ్ మాత్రం మారడంలేదంతే. ఇప్పుడేమో కొత్తగా, సినిమాకి సమయం తగ్గించి, రాజకీయానికి సమయం ఎక్కువగా ఇవ్వాలని పవన్‌కళ్యాణ్ అనుకుంటున్నాడట. డాలీ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ చేయాల్సిన సినిమా ఒకటుంది. అది పట్టాలెక్కిందన్న వార్త అప్పుడెప్పుడో బయటకొచ్చింది. అంతే, ఆ సినిమాకి సంబంధించిన న్యూస్ ఇంకేదీ లేదు.
ఎలాగైతేనేం, పవన్‌కళ్యాణ్ – డాలీ దర్శకత్వంలో చేసే సినిమాకి టైమ్ కేటాయిస్తున్నాడట. యాభై రోజులు మాత్రమే.. అంటూ దర్శకుడికి హీరో డెడ్‌లైన్ పెట్టాడన్న ప్రచారం సినీ వర్గాల్లో హాస్యాస్పదమవుతోంది. మామూలుగా వున్నప్పుడే పవన్‌కళ్యాణ్ ఇన్ టైమ్‌లో ఏ సినిమానీ పూర్తి చేయడు. అలాంటిది, రాజకీయాల గురించి ఆలోచిస్తే, ఇంకేమన్నా వుందా.? ఛాన్సే లేదు. 50 కాదు కదా, 100 ఆ పైన ఎంత ఎక్కువ సమయం ఇచ్చినా, సినిమా పూర్తవడం అంత వీజీ కాదు.
జనసేన పార్టీ కోసం సమయం కేటాయించడం కోసం సినిమాల్ని మానేయాల్సిన పనేమీ లేదు. నెమ్మదిగా పార్టీని బిల్డప్ చేసుకోవాలి. పార్టీకి సంబంధించి మాట్లాడేవారిని (అదేనండీ, అధికార ప్రతినిథుల్ని) నియమించుకోవాలి. ఒక్కో పనీ ఈపాటికే చేసి వుంటే, పరిస్థితులు ఇంకోలా వుండేవి. నాకు మెలకువొచ్చింది, హంగామా చేస్తానంటే అదెలా కుదురుతుంది.? ఏంటో, పవన్‌కళ్యాణ్‌కి సినిమా అన్నా రాజకీయం అన్నా బొత్తిగా తేడా తెలియడంలేదంతే.