సహజనటికి సింపతీ దక్కిందా.?

‘రాజేంద్రప్రసాద్‌ గెలిచాడు.. అయితే జయసుధ ఓడిపోయిందని కాదు..’ ఇదే మాట సినీ పరిశ్రమలో ప్రముఖంగా విన్పిస్తోంది మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం. అందరికీ తెల్సిన విషయమే తొలుత రాజేంద్రప్రసాద్‌ తాను…

‘రాజేంద్రప్రసాద్‌ గెలిచాడు.. అయితే జయసుధ ఓడిపోయిందని కాదు..’ ఇదే మాట సినీ పరిశ్రమలో ప్రముఖంగా విన్పిస్తోంది మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం. అందరికీ తెల్సిన విషయమే తొలుత రాజేంద్రప్రసాద్‌ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తే, ఆ తర్వాత మురళీమోహన్‌ అనూహ్యంగా జయసుధ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. అందుకే, ఇక్కడ పోటీ రాజేంద్రప్రసాద్‌కీ, మురళీమోహన్‌కీ.. అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.

మురళీమోహన్‌ రాజకీయ వ్యూహం బెడిసి కొట్టడంతో, ఆయనకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ఎడా పెడా కామెంట్స్‌ వస్తున్నాయి. పైగా, ఆయన టీడీపీ నేత కూడా. రాజమండ్రి ఎంపీగా పనిచేస్తున్న మురళీమోహన్‌, కేవలం రాజకీయ కోణంలోనే జయసుధ పేరుని తెరపైకి తెచ్చారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఎందుకంటే, రాజేంద్రప్రసాద్‌కి సినీ పరిశ్రమలో ఎవరితోనూ వివాదాల్లేవు. ఆయన పోటీలో నిలబడినప్పుడు మురళీమోహన్‌ మద్దతిచ్చి వుండాల్సింది.

జయసుధ విషయానికొస్తే, ఆమె కూడా పోటీ చేసే విషయమై తొందరపడ్డారు. దానికి మించి, ఆమె రాజకీయ విమర్శలు చేశారు, మా ఎన్నికల్లో తమపై పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ టీమ్‌ మీద. ఇక్కడే చాలామందికి ‘జయసుధ మహిళ’ అన్న సింపతీ కూడా పోయింది. సిట్టింగ్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌ చెప్పారు గనుక, జయసుధ ధీమాతో పోటీ చేసేశారు. మురళీమోహన్‌పై వచ్చిన వ్యతిరేకతతో ఓడిపోయారు.

తీవ్ర వ్యతిరేకత ప్రస్తుతానికి మురళీమోహన్‌పై వున్న కారణంగా జయసుధ మీద కాస్త సింపతీ కన్పిస్తోంది. కానీ, రాజేంద్రప్రసాద్‌ మీద పోటీకి దిగి, రాజకీయం ప్రదర్శించారన్న కోణంలో జయసుధపైనా వ్యతిరేకత అలా ఇలా లేదు. గెలిచిన రాజేంద్రప్రసాద్‌ టీమ్‌ మాటల్లో పరోక్షంగా ఆమె పట్ల వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోంది.