చాలా కాలం తరువాత హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమా విడుదల ఒక్క రోజులో వుంది. సినిమాకు ఇంతో అంతో బజ్ వచ్చిందన్న ఆనందం కాస్త ఆ ఫ్యామిలీలో కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో విషాదం అలుముకుంది. రాజశేఖర్ భార్య, నటి జీవితకు తన పుట్టింటి వైపు నుంచి మిగిలిన ఏకైక బంధువు, స్వంత సోదరుడు మురళి మృతి చెందారు.
ఆయన గత వారం రోజులుగా అస్వస్థతతో వున్నారు. వెంటిలేటర్ పై పెట్టారు. ఓ పక్క ఆయనను చూసుకుంటూనే సినిమా విడుదల ముందు జరిగే ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజశేఖర్, జీవిత బిజీగా వున్నారు. సినిమాకు స్పేషల్ ప్రీమియర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఇలా జరిగింది.
రాజశేఖర్ ఎఫ్ ఎమ్ ఇంటర్వూలో వుండగా పరిస్థితి బాగా లేదని కబురు అందడంతో ఆయన వెంటనే సగంలో కార్యక్రమం ఆపేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అర్థరాత్రి సమీపంలో జీవిత సోదరుడు మరణించారు. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయిన ఈ తరుణంలో, థియేటర్లు, బయ్యర్లు, నిర్మాత తదితరుల సమస్యను దృష్టిలో వుంచుకుని సినిమాను విడుదల చేస్తారో, లేదా ఈ విషాదంలో ఆపుతారో చూడాలి.