శివ సినిమాతో దర్శకుడిగా వర్మకు ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. ఇప్పుడు మరోసారి అదే వర్మకు దర్శకుడిగా మరో ఆఫర్ ఇచ్చాడు. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ-నాగార్జున కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతకుమించి కొత్తదనం ఏమీ లేదు. వర్మ దర్శకత్వంలో ఎలాగైనా నటించాలనే కసితో నాగార్జున ఒప్పుకున్న సినిమా కాదిది. దర్సకుడిగా వర్మను నిలబెట్టేందుకు మంచితనంతో ఇచ్చిన ఆఫర్ ఇది.
ఈ సినిమాను నాగార్జున నిర్మించడం లేదు. రెమ్యూనరేషన్ తీసుకొని జస్ట్ నటిస్తాడంతే. ఇంకా చెప్పాలంటే నాగ్ పై ఎలాంటి ఒత్తిడి లేదు. సినిమా ఫ్లాప్ అయినా నాగ్ కు పోయేదేం లేదు. ఎటొచ్చి వర్మ మాత్రం ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నవాడవుతాడు. పైగా ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై వర్మ నిర్మిస్తున్నాడు. తేడా కొడితే దర్శకుడిగా, నిర్మాతగా వర్మకే నష్టం.
కాకపోతే సినిమా పబ్లిసిటీ, కాల్షీట్లు, రిలీజ్ వ్యవహారాల విషయంలో వర్మకు సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నాగ్. రాజుగారి గది-2కు చేసినట్టే ఎక్స్ క్లూజివ్ ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాతో నాగ్ ఏ రేంజ్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటే.. అన్నీ కలిసొచ్చి హిట్ అయితే క్రెడిట్ మొత్తం నాగ్ కు వెళ్తుంది.. ఫ్లాప్ అయితే మాత్రం అంతా కలిసి వర్మను మరోసారి తిడతారు. అదీ లెక్క.