మూడేళ్లు గీతా సంస్థలో స్టక్ అయిపోయాడు. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం రెండు సినిమాలు చేసాడు. ఇదీ దర్శకుడు పరుశురామ్ గురించి ఇప్పుడు జనాలు అనుకునేది. కానీ పరుశురామ్ మూడేళ్ల ఓపిక ఓ జాక్ పాట్ కు దారి తీసిందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. శ్రీరస్తు శుభమస్తు మంచి సినిమానే. కానీ హీరోకు అంతగా ఫాలోయింగ్ లేక, రాంగ్ టైమ్ లో విడుదల కావడంతో, జస్ట్ రికవరీ, కాస్త లాభం మాత్రం కళ్లచూసింది.
మరి ఆ డైరక్టర్ కు మరో సినిమా ఇస్తే రెమ్యూనిరేషన్ ఏం ఇస్తారు. మహా అయితే కోటి. వాస్తవానికి మంచు ఫ్యామిలీ సినిమాను దర్శకుడు పరుశురామ్ ఒప్పుకున్నదే కొటి పాతికలక్షల రెమ్యూనిరేషన్ కు అని వినికిడి. సో.. అందువల్ల గీత గోవిందం సినిమాకు కూడా మహా అయితే కోటి రూపాయిలు ఇచ్చి వుండేవారు.
కానీ అలా చేయలేదు. లాభాల్లో 20శాతం వాటా పెట్టారు. పెట్టుబడి లేదు. అరవింద్, బన్నీ వాస్ లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఖర్చు పెట్టుకుని, తమ తమ లాభాల్లోంచి చెరో పది డైరక్టర్ కు లాభం కిందపెట్టారు. నెలవారీ ఖర్చులు ఇచ్చారు డైరక్టర్ కు. అది నెలకో రెండు మూడులక్షల వంతున. అంటే మూడేళ్లకు ఓ ముఫై నలభై లక్షలు.
ఇప్పుడు ఏమయింది. గీత గోవిందం అన్నీ తీసేసినా, ఎలా లేదన్నా ఇరవై కోట్ల వరకు లాభం కళ్లచూసేలా వుంది. అంటే నాలుగు కోట్లు పరుశురామ్ కు వస్తుంది. మరి జాక్ పాట్ కాదా ఇది? ఆ కృతజ్ఞతతోనే పరుశురామ్ తనకు ఇప్పటి వరకు నెలవారీ ఇచ్చిన ఖర్చులు ఇందులోంచి కట్ చేసేసుకోమని ముందే చెప్పేసాడట. అయితే అరవింద్ పెద్ద మనసుతో, ‘మంచి సినిమా ఇచ్చావ్.. బ్యానర్ కు. ఎంజాయ్’ అన్నారట.
ఫ్లాటైపోయి ఫ్లాట్ ఇచ్చాడు
ఈ జాక్ పాట్ వైనం ఇలావుంటే, ఏడాది కిందట పరుశురామ్ నిర్మాత బన్నీ వాస్ ఓ డిఫరెంట్ సినిమా కథ చెప్పాడట. సంస్థకు, నిర్మాతకు మంచి సినిమా తీసారు అని పేరు తెచ్చే కథ. కమర్షియల్ గా కాదు. ఆ కథ విని నిర్మాత బన్నీ వాస్ ఫ్లాట్ అయిపోయాడట. ఇది నాకు కావాలి.. నీకేం కావాలి అని అడిగి మరీ, తను అప్పుడే కొన్న ఓ ఫ్లాట్ ను డైరక్టర్ కు ఇచ్చేసాడట. ఇంకేం వుంది డైరక్టర్ మరోసారి ఓ ఇంటివాడైపోయాడు.