ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదల ఇటు నందమూరి అభిమానులకు, అటు టీడీపీ కార్యకర్తలకు పెద్ద పండగలా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సైతం.. సగటు ప్రేక్షకుల్లా మారిపోయి వేకువజాము షోకే వెళ్లిపోయారు. నందమూరి కుటుంబం అంతా కలసికట్టుగా సినిమా చూసింది.
సినిమా విషయంలో లోలోపల కోపంగా ఉన్న చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం సినిమా ప్రీమియర్ కు హాజరయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ నటించకపోయినా, కనీసం ప్రీమియర్ కు వస్తాడని అంతా ఆశించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బయోపిక్ కు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈమధ్య కాలంలో బాబాయ్-అబ్బాయ్ కలిసిపోయారని అంతా అనుకున్నారు. దీనికితోడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తారక్ రావడంతో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చినోడు ప్రీమియర్ కు రాకుండా ఉంటాడా అని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం షాకిచ్చాడు.
2009 ఎన్నికల్లో తనని వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై పీకలదాకా కోపంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఇటీవల బాబాయ్ బాలయ్యతో కూడా ఏమంత సఖ్యంగా ఉన్నట్టు కనిపించడంలేదు. చివరకు సోదరి సుహాసినికి మద్దతుగా తెలంగాణలో ప్రచారానికి కూడా రాలేదు.
మొహమాటానికి ఎన్టీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాత్రం వచ్చి మమ అనిపించాడు. ఇప్పుడు ప్రీమియర్ కు డుమ్మాకొట్టాడు. తాతపై గౌరవం, బాబాయ్ పై అభిమానం.. వీటన్నిటికంటే ఏదో బలమైన కారణమే జూనియర్ ని వెనక్కి లాగి ఉండొచ్చు. అది ఆత్మాభిమానమే కావొచ్చు.
నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ బయోపిక్ ప్రీమియర్ షో ఫొటోస్ కోసం క్లిక్ చేయండి