‘కబాలి’ ఎప్పుడొస్తాడు.?

రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు సిద్ధమయ్యింది. అయితే, సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు రజనీకాంత్‌ విదేశాలకు వెళ్ళారు. అప్పటినుంచీ, ఆయన యోగక్షేమాలపై అభిమానుల్ని టెన్షన్‌ అలానే వెంటాడుతోంది. అనారోగ్య సమస్యలతో రజనీకాంత్‌…

రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు సిద్ధమయ్యింది. అయితే, సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు రజనీకాంత్‌ విదేశాలకు వెళ్ళారు. అప్పటినుంచీ, ఆయన యోగక్షేమాలపై అభిమానుల్ని టెన్షన్‌ అలానే వెంటాడుతోంది. అనారోగ్య సమస్యలతో రజనీకాంత్‌ విదేశాలకు వెళ్ళారన్న ప్రచారమే ఇందుకు కారణం. 'కబాలి' ఆడియో కూడా విడుదలయ్యింది, అయినా రజనీకాంత్‌ నుంచి ఒక్క వీడియో బైట్‌ కూడా రప్పించలేకపోయారు చిత్ర దర్శక నిర్మాతలు. 

తాజాగా రజనీ కుటుంబ సభ్యులు, వైద్య పరీక్షల నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్ళారనే విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేయడంతో, టెన్షన్‌ ఇంకాస్త పెరిగింది అభిమానులకి. ఆ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన రజనీకాంత్‌, చాలా రోజులపాటు అభిమానుల్ని ఆందోళనకు గురిచేసిన విషయం విదితమే. విదేశాలకు వెళ్ళి, కొన్ని రోజులు అక్కడే రెస్ట్‌ తీసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో రజనీకాంత్‌ తిరిగొచ్చారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, 'కబాలి' సినిమా విడుదలకు ముందు, తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితిపై టెన్షన్‌ పెరిగిపోతోంది అభిమానులకి. సినిమా సంబరాలు అభిమానుల్లో ఏమాత్రం కన్పించడంలేదు, రజనీ అనారోగ్యం గురించిన టెన్షన్‌ తప్ప. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రజనీకాంత్‌, అభిమానుల ముందుకొస్తారని ఆయన కుటుంబ సభ్యులు భరోసా ఇస్తుండడం ఒక్కటీ ఊరట. 

పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న 'కబాలి'లో రజనీకాంత్‌ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. గ్యాంగ్‌స్టర్‌గా రజనీకాంత్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు.