‘కబాలి’ కావాలా.? నెట్టింట్లో వెతుక్కోండి.!

ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, అది విడుదలకు ముందు లీక్‌ అవుతుందా.? విడుదలయ్యాక పైరసీకి గురవుతుందా.? అన్న సందేహాలు అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అన్న తేడాల్లేవు..…

ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, అది విడుదలకు ముందు లీక్‌ అవుతుందా.? విడుదలయ్యాక పైరసీకి గురవుతుందా.? అన్న సందేహాలు అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అన్న తేడాల్లేవు.. అందరికీ ఒకటే టెన్షన్‌. అటు లీకేజీలు, ఇటు పైరసీ.. రెండూ కలిసి సినిమా రంగాన్ని సర్వనాశనం చేసేస్తున్నాయి. 

పైరసీ సర్వసాధారణమైపోయింది. దానికి అడ్డుకట్ట వేయడం దాదాపు అసాధ్యమే. కానీ, లీకేజీలకు అడ్డకట్ట వేయడానికి ఛాన్సుంది. దురదృష్టవశాత్తూ సెన్సార్‌ బోర్డ్‌ దగ్గరే సినిమాలు లీకైపోతోంటే సినీ పరిశ్రమ గోడు ఎవరితో చెప్పుకోవాలి.? మొన్నీమధ్యనే 'ఉడతా పంజాబ్‌' సినిమా విడుదలకు ముందు లీకైంది. ఆ తర్వాత 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' నిర్మాతని ఏడిపించేసింది. ఇదిగో, ఇప్పుడు 'కబాలి'కి లీకేజ్‌ టెన్షన్‌ పట్టుకుంది. 

అయితే, ఇప్పటిదాకా 'కబాలి' లీకైందన్న గాసిప్స్‌ తప్ప, ఆ లీకేజీ సారాంశమిదీ.. అని ఎక్కడా ఎవరూ పెదవి విప్పని పరిస్థితి. లీకేజీ గాసిప్స్‌తో ఒక్కసారిగా నెటిజన్లు, నెట్టింట్లో సెర్చింగులు షురూ చేసేశారు. ఇదో టైపు పబ్లిసిటీ. సినిమా లీకైపోయిందని కొందరు, కాదు కాదు.. లీకేజీ లేదు ఏమీ లేదు.. అని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. 

మరోపక్క, పైరసీని అడ్డుకునేందుకు దాదాపు 250 వెబ్‌ సైట్ల మీద నిఘా పెట్టింది 'కబాలి' యూనిట్‌. అదే సమయంలో, అభిమానులు ఇంటర్నెట్‌ని జల్లెడపట్టేస్తున్నారు. సినిమాని చూడటం ఒక ఎత్తు, పైరసీని అడ్డుకోవడం ఇంకో ఎత్తు.. అన్నట్లు రజనీకాంత్‌ అభిమానులు, ఇంటర్నెట్‌ వేదికగా పెద్ద ఆపరేషన్‌ చేపట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కబాలి' ఈ లీకేజీ గాసిప్స్‌ నుంచీ, పైరసీ బూతం నుంచి బయటపడగలదా.? వేచి చూడాల్సిందే.