‘కబాలి’కీ ‘రోబో’కీ లింకేంటి.?

'కబాలి' సినిమా షరామామూలుగానే వచ్చి వెళ్ళి'పోయింది'. అంచనాల్ని తల్లకిందులు చేసి, బొక్క బోర్లా పడింది 'కబాలి'. ఐదొందల కోట్ల బిజినెస్‌ చేస్తుందంటూ 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్‌ థాను సినిమా విడుదలకు ముందు నానా…

'కబాలి' సినిమా షరామామూలుగానే వచ్చి వెళ్ళి'పోయింది'. అంచనాల్ని తల్లకిందులు చేసి, బొక్క బోర్లా పడింది 'కబాలి'. ఐదొందల కోట్ల బిజినెస్‌ చేస్తుందంటూ 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్‌ థాను సినిమా విడుదలకు ముందు నానా హంగామా చేసిన విషయం విదితమే. సినిమా రిలీజయ్యాక కూడా రెండొందల కోట్ల పైనే వసూళ్ళు వచ్చాయంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించాడీ నిర్మాత. 

కానీ, 'కబాలి' ఫలితం తేలి'పోయింది'. ఇప్పుడిప్పుడే 'కబాలి' డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గళం విప్పేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే, 'కబాలి' విడుదలైన వెంటనే, అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన రజనీకాంత్‌, 'కబాలి' విషయంలో ఎవరూ తొందరపడి ఎలాంటి బహిరంగ ప్రకటనలూ చేయొద్దని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారట. దాంతో, కొన్నాళ్ళు సైలెంటయిన వారంతా, ఇప్పుడు గళం విప్పక తప్పదనే నిర్ణయానికి వచ్చారట. 

అయితే, 'కబాలి' దెబ్బతో కుదైలేనవారందరికీ 'రోబో 2.0'తో న్యాయం చేస్తానని రజనీకాంత్‌ నుంచి హామీ వచ్చిందంటూ తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా వచ్చిన 'రోబో' ఘనవిజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా రానున్న 'రోబో 2.0'పైనా భారీ అంచనాలే వున్నాయి. కానీ, శంకర్‌ గత చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. పైగా, 'రోబో 2.0' చిత్రానికీ, 'కబాలి' చిత్రానికీ నిర్మాత ఒకరు కాదు. 

కేవలం రజనీకాంత్‌ హామీతో, డిస్ట్రిబ్యూటర్లయినా ఎగ్జిబిటర్లు అయినా సైలెంట్‌గా వుండేందుకు ఛాన్సులు తక్కువే ప్రస్తుత పరిస్థితుల్లో. మరి, 'కబాలి' దెబ్బతో కుదేలైనవారంతా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే పరిస్థితి ఏంటట.?