టాలీవుడ్ మిత్రవింద, అందాల చందమా కాజల్ అగర్వాల్‌ని బాలీవుడ్ బాగానే భయపెట్టినట్టుంది. ఇకపై బాలీవుడ్‌లో సినిమాలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటానంటోంది కాజల్. తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్‌ని కాజల్ వద్దనుకుందట. ఎందుకిలా.? అంటే, గత సినిమాల అనుభవాలేనని కాజల్ తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటోందట.
అవును మరి, టాలీవుడ్‌లో అవకాశాలు బాగానే వున్నప్పుడు, బాలీవుడ్‌కి వెళ్ళి చేతులు కాల్చుకోవడమెందుకట.? ఇదీ కాజల్ అగర్వాల్ లాజిక్. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తోంది. తమిళంలోనూ కాజల్‌కి అవకాశాలు బాగానే వున్నాయి. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ సినిమాకి సైన్ చేస్తే అంతే సంగతులు, వున్న అవకాశాల్ని పోగొట్టుకున్నట్లవుతుంది.
ఇక, కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో 'సింగం', 'స్పెషల్ 26', 'దో లఫ్జోంకా కహానీ' తదితర సినిమాల్లో నటించిన విషయం విదితమే. ఇందులో ఆమెకు కమర్షియల్‌గా కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ విజయాన్నిచ్చింది 'సింగం' సినిమా మాత్రమే. 'స్పెషల్ 26', 'దో లఫ్జోంకా కహానీ' కాజల్‌ని పెద్దగా ఆదుకోలేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైపోదామనుకుని, అక్కడ తేడా కొట్టేయడంతో మళ్ళీ సౌత్‌లోనే అవకాశాల్ని వెతుక్కుంటోంది.
'చందమామ' నుంచి ఇప్పటిదాకా కాజల్ అగర్వాల్ తెలుగులో సుదీర్ఘమైన కెరీర్‌ని కొనసాగిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో కాజల్‌కి ఇప్పటికీ చెప్పుకోదగ్గ డిమాండే వుంది మరి. బాలీవుడ్ అవకాశమంటే ఎగిరి గంతేసే హీరోయిన్లు వున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్ ఫీవర్‌ని ఆల్రెడీ రుచిచూసి వచ్చిన కాజల్, ఎందుకో బాలీవుడ్ అంటే ఆమడదూరం పారిపోతోంది. ఏంటో మరి, కాజల్‌కి బాలీవుడ్‌లో అంతగా భయపెట్టిన విషయం. కేవలం ఫెయిల్యూర్‌లేనా.?