కమల్ దగ్గర డైరెక్టర్లు డమ్మీలేనా..?!

కమల్ హాసన్ నిస్సందేహంగా అద్భుతమైన నటుడు…సృజనకారుడు.. బహుముఖ ప్రజ్ఞాశీలి.. ఒక్కమాటలో చెప్పాలంటే సకలకళా వల్లభుడు. భారతీయ సినిమాకు గర్వకారణంగా చెప్పదగ్గ వ్యక్తి కమల్. మరి కమల్ వ్యక్తిగత ప్రతిభ సంగతలా ఉంటే.. ఆయన తన…

కమల్ హాసన్ నిస్సందేహంగా అద్భుతమైన నటుడు…సృజనకారుడు.. బహుముఖ ప్రజ్ఞాశీలి.. ఒక్కమాటలో చెప్పాలంటే సకలకళా వల్లభుడు. భారతీయ సినిమాకు గర్వకారణంగా చెప్పదగ్గ వ్యక్తి కమల్. మరి కమల్ వ్యక్తిగత ప్రతిభ సంగతలా ఉంటే.. ఆయన తన సమస్థాయి ప్రతిభావంతులను తట్టుకోగలడా? అనేదే ఒక  సందేహం! సమస్థాయి అనడం కన్నా.. తమ కంటూ ఒక స్థాయి ఉన్న వాళ్లతో కమల్  వర్క్ చేయడం కొంచెం కష్టమే. ఈ జాబితాలో  కమల్ తో అద్భుతమైన సినిమాలు చేసినా ఆయన గురుస్థాయి వాళె్లైన భారతిరాజా, బాలచందర్, విశ్వనాథ్ లాంటి వాళ్లను పక్కన పెట్టాలి. అలాంటి లెజెండ్లను పక్కనపెడితే కమల్ తరం దర్శకులు మాత్రం ఆయనను భరించడం కొంచెం కష్టమే. అనే ఉదంతాలు దీనికి రుజువులుగా ఉన్నాయి.

విడుదలకు సిద్ధంగా ఉన్న కమల్ సినిమా ‘ఉత్తమ విలన్’కు దర్శకుడు రమేష్ అరవింద్. ఈ సినిమా తర్వాత కమల్ చేయబోయే సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇక వేరే సినిమాలకు స్వయంగా కమల్ దర్శకత్వం వహించుకొంటున్నాడు. కొంచెం వెనక్కు వెళ్లి చూస్తే… మన్మధబాణం, ఈనాడు, దశావతారం వంటి సినిమాలకు దర్శకులు కమల్‌కు సన్నిహితులు. కేఎస్ రవికుమార్ ‘దశావతారం’, ‘మన్మధబాణం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన హీరోల దర్శకుడు. హీరోల ఇమేజ్‌కు అనుగుణంగా నడుచుకొనే దర్శకుడు. ఇక ‘ఈనాడు’ వంటి రీమేక్ సినిమాను చక్రితోలేటి దర్శకత్వం వహించాడు. అతడికి అదే తొలి సినిమా. రీమేక్ సబ్జెక్ట్ కూడా కాబట్టి తోక జాడించే అవకాశాలే లేవు. ఒరిజినల్ వెర్షన్‌కు కార్బన్ కాపీగా.. కమల్ చెప్పిన కాపీగా అతడు సినిమాను తీశాడు. ఇక రమేష్ అరవింద్ కమల్ సంస్థానంలోని వ్యక్తి. 0, 90ల నుంచి ఈ నటుడు కమల్ సినిమాల్లో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇలాంటి వారితో చేయడంలో కమల్‌కు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇలాంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు కమల్ తన క్రియేటివిటీని చూపడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఎలాగూ ఆ దర్శకులు కమల్‌ను దేవుడిలా చూస్తారు.. 

కాబట్టి చిత్రీకరణ విషయంలో కమల్ జోక్యానికి ఎక్కడా అడ్డంకులుండవు. అయితే సొంతంగా తమకంటూ ఒక స్టైల్ ఉండే దర్శకులు అయితే కమల్‌కు ఎక్కడలేని ఇబ్బందులొస్తాయి. వాళ్లు వాళ్ల స్టైల్లో తీస్తామని అంటే కమల్ తన స్టైల్లో మరోటి చెబుతాడు. దీంతో మొత్తం వ్యవహారం వివాదంగా మారుతుంది. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ సినిమా విషయానికే వస్తే.. దీని నిర్మాత ‘లింగుస్వామి’ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ‘తిరుపతి బ్రదర్స్’ బ్యానర్ మీద స్వామి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఒక దర్శకుడు ఒక స్టార్ హీరోను పెట్టి మరో కరి దర్శకత్వంలో సినిమాను రూపొందించడమంటే అదొక విశేషమే. కమల్ రచించుకొన్న కథను లింగుస్వామి తీయలేక రమేశ్ అరవింద్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడనుకోలేం. కమల్‌తో అనవసరంగా ఇగో క్లాషెష్ రాకుండా జగ్రత్త వహిస్తూనే నిర్మాత అయిన లింగుస్వామి ఈ సినిమా డైరెక్షన్ జోలికి వెళ్లలేదు అనేది వాస్తవం. గతంలో కొంతమంది దర్శకులతో కమల్‌కు ఉన్న అనుభవాలను బట్టే లింగుస్వామి సేఫ్‌జోన్‌ను ఎంచుకొన్నట్టు తెలుస్తోంది.

పాత ఉదాహరణలను ప్రస్తావించాలంటే ప్రియదర్శన్‌కు ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మళయాల దర్శకుడు చాలా ఉత్సాహంతో కమల్‌తో పనిచేయడానికి ముందుకొచ్చాడు. కమల్ కూడా ఆ సినిమా పట్ల ఉత్సాహాన్ని చూపాడు. ఇద్దరూ కలిసి చర్చలకు కూర్చొన్నారు. ‘అన్బేశివం’ (తెలుగులో సత్యమేశివం) స్క్రిప్ట్‌ను తయారు చేసుకొన్నారు. ఈ సినిమా అద్భుతమైనది. ఉత్తమ మానవత్వ విలువలను ఆవిష్కరించిన సినిమా. ఈ సబ్జెక్టును తయారు చేయడానికి కమల్- ప్రియదర్శన్‌లు కొన్ని నెలలు పాటు కష్టపడ్డారు.

అయితే తీరా సబ్జెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లే సరికే.. ఈ ఇద్దరూ ఒకరికొకరు బోర్ కొట్టారు! కమల్‌తో పనిచేయలేనని ప్రియదర్శన్ ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అయితే కమల్ లెక్క చేయలేదు. ప్రియదర్శన్‌ను ప్రాధేయపడేదేమీ లేదన్నట్టుగా సుందర్.సిని తెరపైకి తెచ్చాడు. ఆ సినిమాను తనదైన శైలిలో చుట్టేశాడు. అయితే ఆ సినిమాకు ఆ లోటేమీ కనపడలేదు. కామెడీ మాస్ మసాలా సినిమాలు తీసుకొనే సుందర్.సి ‘సత్యమే శివం’ డైరెక్టర్ అంటేనే ఆ సినిమాను అమితంగా ఇష్టపడే వాళ్లే ఆశ్చర్యపడతారు. ఇదీ తన శైలిలో సినిమాలను తీసేతత్వం ఉన్న ప్రియదర్శన్‌కు కమల్‌తో మిగిలిన అనుభవం. కేవలం ప్రియదర్శనే కాదు.. దర్శకుడు శంకర్ కూడా కమల్ బాధితుడే అని అంటారు కోలీవుడ్ సినీ పండితులు. ‘భారతీయుడు’ సినిమా విషయంలో తన మార్కును నిలబెట్టుకోవడానికి శంకర్ చాలా కష్టాలే పడ్డాడని అంటారు. 

భారతీయుడు సినిమా సమయానికి శంకర్‌కు పెద్దగా అనుభవం లేదు. అప్పటికే వైవిధ్యమైన సబ్జెక్టుల విషయంలో కమల్ తలపండిపోయిన వ్యక్తి. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కాగానే.. ‘ఏముంది.. శంకర్‌ను పక్కన కూర్చోబెట్టి మొత్తం సినిమాను కమల్ చుట్టేస్తాడు..’ అనే అభిప్రాయాలే వినిపించాయి. అయితే శంకర్ భీకర ప్రయత్నాలు చేసి భారతీయుడు సినిమా విషయంలో తన పంథాను చూపించగలిగాడు. ‘భారతీయుడు’ అంతటి హిట్ సినిమాను తీశాకా మళ్లీ ఇప్పటి వరకూ శంకర్ కమల్‌తో సినిమా ఆలోచన చేయకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. అర్జున్, రజనీకాంత్ వంటి వాళ్లతో ఒకటికన్నా ఎక్కువ సినిమాలు చేసిన శంకర్ ‘భారతీయుడు’ తర్వాత మళ్లీ కమల్‌తో సినిమా ఆలోచననే ప్రతిపాదించిన దాఖలాలు లేవు. 

స్థూలంగా చెప్పాలంటే కమల్ నిస్సందేహంగా సృజనకారుడు. ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ చూపిస్తాడు. ఈ శ్రద్ద అంతా సినిమా బాగా రావాలనే. అయితే సినిమాపై తమ మార్కు ఉండాలని భావించే దర్శకుల దగ్గర మాత్రం ఇలాంటి తీరు ఎదురవుతుంది. అదే కమల్‌తో పాటు మంచి సినిమాలో భాగస్వామి కావాలనే సగటు దర్శకులకు మాత్రం కమల్ జోక్యం ఆనందాన్నిస్తుంది.ఈ విషయంపై కమల్‌కు కూడా క్లారిటీ ఉంది. అందుకే పెద్ద దర్శకులు.. తమకంటూ ప్రత్యేక శైలి ఉన్న దర్శకుల జోలికి పోకుండా.. తనను వందశాతం యాక్సెప్ట్ చేసే దర్శకులతోనూ.. తన జోక్యాన్ని స్వాగతించే దర్శకులతోనే పనిచేస్తున్నాడు.