తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఓకే చెప్పినప్పుడే ఎన్టీఆర్ పై వత్తిడి ఉంది. ఎందుకంటే అప్పటికే ఆ షో చేసేందుకు కమల్ రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ ఓకే చెప్పిన టైమ్ కు తమిళ బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజైంది. ఇప్పుడు ఎన్టీఆర్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఈసారి కూడా ప్రెషర్ కు కారణం కమల్ హాసనే.
కమల్ చేసిన తమిళ బిగ్ బాస్.. తమిళ టీవీ ఛానెల్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రసారమైన ఈ రియాలిటీ షో రేటింగ్స్ లో టాప్-5లోకి ఎంటర్ కాలేకపోయాయి. కమల్ హాసన్ ఉన్నప్పటికీ ఈ షో టాప్ రేటింగ్స్ తెచ్చుకోలేకపోయింది.
ఈ షోతో టాప్ పొజిషన్ కు చేరుకోవాలన్న స్టార్ విజయ్ కలలు నెరవేరలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే.. బిగ్ బాస్ కంటే స్టార్ విజయ్ లో ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ కు, ఇతర ఛానల్స్ లో వేసిన మరికొన్ని సినిమాలకు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల మధ్య తెలుగులో ఇవాళ్టి నుంచి బిగ్ బాస్ ప్రసారం కాబోతోంది. స్టార్ మాలో రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మరోవైపు ఈ రియాలిటీ షోకు సంబంధించి మొన్నటి నుంచే ఎన్టీఆర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.
లోనవాలాలోని భారీ విల్లాలో ఈ షూటింగ్ జరుగుతోంది. కమల్ బిగ్ బాస్ కు రెస్పాన్స్ అంతంతమాత్రంగా రావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ పై అందరి దృష్టి పడింది.
సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ కాన్సెప్ట్ ను యాజ్ ఇటీజ్ గా కాపీ కొట్టడం వల్లనే కమల్ బిగ్ బాస్ కు ఈ సమస్య వచ్చిందని కొందరు అంటుంటే.. సరైన సెలబ్రిటీస్ పాల్గొనకపోవడంతో బిగ్ బాస్ చప్పగా మారిందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ రెండు విషయాల్లో స్టార్ మా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూడాలి.