ఇస్రో సైంటిస్టులు మహిళా గూఢచారుల వలలో పడి దేశరహస్యాలు అమ్మివేశారని ఆరోపణలు బయటకు వచ్చి 20 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత అబ్బే ఏమీ జరగలేదన్నారు. నిందితుల పట్ల సానుభూతి చూపించారు. కానీ ఆ కేసును పరిశోధించిన పోలీసు అధికారి మాత్యూస్ కుట్ర జరిగిందంటూ ''నిర్భయమ్'' అనే పేర ఆత్మకథ రాసి అచ్యుతానందన్ చేతుల మీదుగా విడుదల చేశాడు.
ఆరోపణల్లో చిక్కుకున్న ప్రముఖ సైంటిస్టు నారాయణన్ ఆ కేసంతా విదేశీ గూఢచారి సంస్థల కుట్ర అంటూ యిప్పుడో పుస్తకం రాసి వెలువరించబోతున్నాడు. తమకు వ్యతిరేకంగా విచారణాధికారి మాత్యూస్ సాక్ష్యాలను సృష్టించాడని అతని ఆరోపణ. ఆ మేరకు మాత్యూస్ సుప్రీం కోర్టులో కేసు ఎదుర్కుంటున్నాడు. వచ్చే నెల ఆగస్టులో తీర్పు రాబోతోంది. ఏది సత్యం? ఏదసత్యం? అనేది సుప్రీం కోర్టు తీర్పుతో తేటతెల్లమౌతుందని ఆశించాలి.
దీని కథ 1994 అక్టోబరులో ప్రారంభమైంది. మాల్దీవులకు చెందిన ముస్లిము మహిళ మరియం రషీదా వీసా పరిమితి దాటి పోయినా తిరువనంతపురంలో మకాం పెట్టిందని తెలిసి, ఆమెను అరెస్టు చేయడానికి కేరళ పోలీసులు వెళ్లారు. ఆమె వద్ద డైరీ దొరికింది. దానిలో మాల్దీవుల జాతీయభాష ఐన ధివేహీ భాషలో ఆమె ఏదో రాసుకుంది. దాన్ని ఇంగ్లీషులో తర్జుమా చేయించి చూస్తే దానిలో అత్యున్నత పదవుల్లో వున్న యిద్దరు ఇస్రో సైంటిస్టుల పేర్లు వున్నాయి. ఒకరు ఎస్.నంబి నారాయణన్, మరొకరు డి.శశికుమారన్. వాళ్లిద్దరూ రాకెట్ సైన్సుకి సంబంధించిన క్రయోజెనిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.
'జూనియర్ కలామ్'గా పేరు తెచ్చుకున్న నారాయణన్ ఆ విభాగాధిపతి. పోలీసులు రషీదాను లోతుగా విచారించి, ఫౌజియా హసన్ అనే మరో మాల్దీవు మహిళ కూడా దీనిలో భాగస్వామి అని తేలితే ఆమెనూ అరెస్టు చేశారు. ఈ ఇద్దరు వనితలు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తరఫున పనిచేస్తున్నారని, క్రయోజెనిక్ టెక్నాలజీని ఇండియానుంచి తస్కరించడానికి వీళ్లను నియోగించారని, వాళ్లు యీ యిద్దరు సైంటిస్టులను తమ కామకలాపాలతో వశం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా వున్న కరుణాకరన్ చర్యలు తీసుకోమని కేరళ పోలీసులను ఆదేశించాడు. వారు ఆ యిద్దరు సైంటిస్టులతో సహా అనేకమందిని అరెస్టు చేశారు.
ఆ డైరీలోనే 'బ్రిగేడియర్ శ్రీవాస్తవ' పేరు కూడా వుంది. సౌత్ జోన్‌కు ఐజిగా పనిచేస్తున్న రామన్ శ్రీవాస్తవనే అలా పేర్కొన్నారని భావించారు. అతను కరుణాకరన్‌కు ఆప్తుడు కావడంతో ముఖ్యమంత్రి సైతం నింద పడవలసి వచ్చింది. కాంగ్రెసులో కరుణాకరన్ వ్యతిరేకవర్గానికి నాయకుడిగా వున్న ఎకె ఏంటోనీ దీనిపై ఆందోళన లేవనెత్తి చాలా గలభా చేశాడు. దేశద్రోహానికి ఒడిగట్టిన సైంటిస్టులపై, ఇస్రో సంస్థపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆ సంస్థకు చెందిన ఉద్యోగులను ఆటోవాళ్లు, టాక్సీవాళ్లు ఎక్కించుకోవడం మానేశారు. ఇస్రో బస్సులపై రాళ్లు రువ్వేవారు.
చివరకు కరుణాకరన్ గద్దె దిగి, ఆంటోనీకి ఆ పదవిని అప్పగించవలసి వచ్చింది. కేసు క్షుణ్ణంగా పరిశీలించడానికి సిట్ (స్పెషల్ యిన్వెస్టిగేషన్ టీము) ఏర్పాటు చేశారు. దానికి అధినేతగా డిఐజిగా వున్న సిబీ మాత్యూస్ను వేశారు. అతను ఆంటోనీకే కాక, ఊమెన్ చాండీకి కూడా ఆప్తుడే. సిట్, కేంద్రానికి చెందిన ఐబి (ఇంటెలిజెన్సు బ్యూరో) కలిసి కేసు విచారించాయి. ఐబికి అప్పట్లో డిప్యూటీ డైరక్టరుగా చేసిన ఆర్బి శ్రీకుమార్ నేతృత్వంలో జరిగిన విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టారని, నేరం ఒప్పుకోమని లేదా ఇస్రోలో అత్యున్నత స్థానాల్లో వున్నవారిపై నింద వేయమని ఒత్తిడి చేశారని నంబి నారాయణన్ ఆరోపించాడు.
తనకు మరియంతో ముఖపరిచయం కూడా లేదన్నాడు. నారాయణన్ని జైల్లో 50 రోజుల పాటు వుంచారు. ఆరోగ్యం పాడవడంతో ఆసుపత్రిలో పెట్టారు. కష్టసమయంలో ఇస్రో తనకు మద్దతుగా నిలవలేదని నారాయణన్ ఫిర్యాదు. ఇస్రోకి చైర్మన్‌గా వున్న కస్తూరిరంగన్ 'లీగల్ వ్యవహారంలో మేమెలా జోక్యం చేసుకుంటాం?' అన్నాడు. పరిస్థితులు యిలా వుండగా కొన్నాళ్లకు కేసును సిబిఐకు అప్పగించారు. కేరళ పోలీసు, ఐబి (ఇన్ఫర్మేషన్ బ్యూరో) కలిసి సేకరించిన సాక్ష్యాలను సిబిఐ కొట్టిపారేసింది. గూఢచర్యం జరగలేదని తేల్చేసింది. 1996 నాటికల్లా నిందితులందరినీ విడుదల చేసేసి, కేసు క్లోజ్ చేసేసింది కూడా. ఈ సెక్స్ స్కాండల్‌ను మాత్యూస్, అతని యిద్దరు సహాయకులు కల్పించారు కాబట్టి వారిపై తగు చర్య తీసుకోవాలని సిబిఐ సుప్రీం కోర్టుకు నివేదిక యిచ్చింది.
సుప్రీం కోర్టు సిబిఐ చర్యను సమర్థించింది కూడా. నిజానిజాలు ఎలాగున్నా, నిందితుల కెరియర్లు నాశనమయ్యాయి. నంబి నారాయణన్‌కు ఉద్యోగం వెనక్కి యిచ్చినా అతి ముఖ్యమైన క్రయోజెనిక్ డిపార్టుమెంటు నుంచి తప్పించి బెంగుళూరుకు బదిలీ చేశారు. 2001లో రిటైరయ్యాడు. జరిగినదానితో సమాధానపడి శశికుమారన్ వూరుకున్నా, నారాయణన్ మాత్రం వూరుకోదలచలేదు. నా కెరియర్, నా ప్రతిష్ఠ నాశనమయ్యాయి. కుటుంబపరంగా నష్టపోయాను. అందువలన నాపై తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై చర్య తీసుకోవాలి. నాకు పది లక్షల రూ.లను పరిహారంగా యివ్వాలి అని కేసు పెట్టాడు.
1996లో కేరళలో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి లెఫ్ట్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చింది. వాళ్లు కేసు తిరగతోడి టిపి సేన్‌కుమార్ అనే అధికారికి అప్పగించారు. అయినా అతను కొత్త ఆధారాలు కనిపెట్టలేదు. సిబిఐ సిఫార్సు చేసినా లెఫ్ట్ ప్రభుత్వం మాత్యూస్పై చర్యలు తీసుకోలేదు. నారాయణన్ కోర్టులో కేసు వేశాడు కదా, దాని తీర్పు వచ్చేదాకా వేచి చూస్తున్నాం అంది. 2001లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నారాయణన్‌కి రూ.1 కోటి నష్టపరిహారం యిమ్మనమని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ హైకోర్టు రూ.10 లక్షలు యిమ్మనమంది.
నారాయణన్ కథను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తామని కొందరు ముందుకు వచ్చారు. నారాయణన్‌పై సానుభూతి పెరిగిన కొద్దీ మాత్యూస్ విలన్‌గా తోచసాగాడు. కొంతమంది రిపోర్టర్లు ఒక కథనాన్ని ముందుకు తెచ్చారు. దాని ప్రకారం – 1994 మధ్యలో కేరళ ముస్లిం లీగ్‌కు చెందిన కేరళ మంత్రి ఒకరు కువాయిత్ నుంచి కొందరు కువాయిత్ పౌరులను కేరళలోని ఒక ఫంక్షన్‌కు ఆహ్వానించాడు. సదరు అతిథులను కేంద్రం అవాంఛిత వ్యక్తులుగా (పెర్సానా నాన్-గ్రేటా) పరిగణిస్తుంది. వీళ్లు కేరళకు రాకుండా చూడమని కేంద్ర హోం శాఖ స్పెషల్ బ్రాంచ్ వారిని ఆదేశించింది.
దానితో బాటు వీసా పరిమితి ముగిసిపోయినా కేరళలో నివాసముంటున్న విదేశీయులకు తనిఖీ చేయమంది. మాల్దీవుల నుంచి వచ్చిన మరియం రషీదా అనే మహిళ ఇండియన్ ఎయిర్‌లైన్సు వారు తమ ఫ్లయిట్స్ రద్దు చేయడం వలన వెనక్కి వెళ్లలేక పోయింది. తన వీసా గడువు ముగిసిపోవడంతో దాన్ని పొడిగించుకుందామని సిటీ పోలీసు కమిషనర్ ఆఫీసుకు రెండు, మూడు సార్లు వచ్చింది. ఆ డెస్కు చూసే అధికారి లేకపోవడంతో విజయన్ వద్దకు వచ్చింది. విజయన్ ఆమెకు సాయం చేస్తానన్నాడు కానీ దానికి బదులుగా ఆమె పొందు కోరాడు. స్ఫురద్రూపి ఐన మరియం మండిపడింది. నా గురించి ఏమనుకుంటున్నావ్? ఇప్పుడే ఐదునిమిషాల క్రితం మీ ఐజీ శ్రీవాస్తవతో మాట్లాడాను తెలుసా? ఒక్క ఫోన్ కొట్టానంటే నీ సర్వీసంతా నాశనం చేస్తాడు అని బెదిరించింది.
ఐజీగా వున్న శ్రీవాస్తవ ముఖ్యమంత్రి అండదండలతో చెలరేగిపోతున్నాడు. శ్రీవాస్తవ రిటైరయ్యేవరకు తనకు ఐజీ పోస్టు రాదని తెలిసిన డిప్యూటీ ఐజీ సిబీ మాత్యూస్కు శ్రీవాస్తవంటే పడదు. ఇవన్నీ తెలిసిన విజయన్ తను సేకరించిన సమాచారాన్ని మాత్యూస్ ముందు పెట్టి 'ఈమెకు మన ఐజీకి లింకుందేమో' అని సందేహం వెలిబుచ్చాడు. ఉంటే సరే, లేకపోతే పెడదాం అన్నాడు మాత్యూస్. కేసుని ఆ విధంగా నడిపించాడు. మరియం చేసిన కొన్ని ఫోన్‌కాల్స్‌ను దొరకబుచ్చుకుని విజయన్ పెద్ద కథ అల్లాడు.
దాని వలన మేత్యూస్ తన సీనియర్‌ను దెబ్బ తీయగలిగాడు అంటుందా కథనం. ఇతనికి వ్యక్తిగతమైన కక్ష సరే, మరి కేంద్రాధికారం కింద పనిచేసే ఐబికి ఏమైంది? అంటే దాని వెనక్కాల అంతర్జాతీయ కుట్ర వుంది అన్నారు. రోదసిలో ప్రయోగాలు చేసే దేశాలతో 'మిస్సయిల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్ (ఎంటిసిఆర్)' అనే పేర అమెరికా ఒక కూటమి ఏర్పరచింది. ఇండియా క్రయోజెనిక్ టెక్నాలజీని సంతరించుకోవడం అమెరికాకు యిష్టం లేదు.
కానీ రష్యా ఇండియాకు క్రయోజెనిక్ ఇంధనం తయారు చేసే టెక్నాలజీ యిస్తానంటూ 1992లో ఇండియాతో ఒప్పందం చేసుకుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ దీనికి అభ్యంతరం తెలుపుతూ రష్యాకు లేఖ రాశాడు. వాళ్లు పట్టించుకోలేదు. అందువలన ఆ కార్యక్రమంలో మన ఇండియాకు అవరోధం కల్పించాలని అమెరికా సిఐఏ ద్వారా మన ఐబిని ప్రభావితం చేసింది. అందుకే ఐబి వీళ్లపై కేసు పెట్టి యీ టెక్నాలజీ కార్యక్రమాన్ని అడ్డుకుంది. ఇదీ ఆ కథనం.
ఈ విధంగా నారాయణన్కేే కాక భారతదేశానికి కూడా నష్టం వాటిల్లడానికి కారణం తనే అని మాటపడడంతో మాత్యూస్ తన వెర్షన్ వినిపించడానికి సమకట్టాడు. మాత్యూస్పై కేరళ ప్రభుత్వం చర్యేమీ తీసుకోలేదు. అతను ఎన్నో ముఖ్యమైన కేసులు చేపట్టి పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఊమెన్ చాండీ ముఖ్యమంత్రి అయ్యాక అతను స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసి, చాండీ ఆఫర్ చేసిన మరో మంచి పోస్టు తీసుకున్నాడు. ఇప్పుడు దాన్లోంచి కూడా బయటకు వచ్చాక గూఢచర్యం నిజంగా జరిగింది అంటూ వాదించాడు.
మరి సిబిఐ లేదంది కదా అంటే అలా అనడానికి కారణం అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారి కుమారుడు ప్రభాకరరావు పేరు కూడా బయటకు రావడమే అంటాడు మాత్యూస్. గూఢచర్యం జరిగిందా లేదా, ఏది నిజమై వుంటుంది అని మీడియావారు కొందరు ఇవిఎస్ నంబూద్రి అనే సైంటిస్టును అడగ్గా ''రాకెట్ టెక్నాలజీ గురించి పోలీసులకు కనీస అవగాహన వున్నా యిలాటి ఆరోపణలు చేసేవారు కారు. ఓ నాలుగు పేపర్లు, మరో నాలుగు డ్రాయింగ్సు యిస్తే అవతలివాళ్లకు తెలిసిపోదు. పైగా ప్రతీ డిపార్టుమెంటుకు కొంతకొంత తెలిసి వుంటుంది. అన్ని డిపార్టుమెంటులూ సహకరిస్తే తప్ప ప్రయోజనం వుండదు.'' అన్నాడు. ఆయనను సిబిఐ విచారణకు పిలిచింది కూడా. 'నంబూద్రి నాకు కీలకమైన సమాచారాన్ని అందించారు.
అది సిబిఐకు చెప్పి వుంటే గూఢచర్యం నిజంగా జరిగిందని తేలేది.'' అన్నాడు మాత్యూస్. ''అబ్బే నేను మాత్యూస్ కేమీ చెప్పలేదు.'' అంటాడు నంబూద్రి. ఐబి అధికారి శ్రీకుమార్ ''నంబూద్రి వాదన అర్థరహితం. రాకెట్ టెక్నాలజీలో ప్రతి చిన్న విషయమూ కీలకమైనదే. ఏదైనా సొంతంగా కనిపెడితే మహా అయితే ప్రభుత్వం ఎవార్డు యిస్తుంది. అదే బయటిదేశాలకు అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి. నీ దగ్గర కొంత సమాచారం, మరొక దేశంలో మరొకరి వద్ద యింకాస్త సమాచారం సేకరించగలరు అవతలివాళ్లు. పాకిస్తాన్, ఉత్తర కొరియా అప్పట్లో ఇస్రోపై కన్నేసి వుంచాయి. మనవాళ్లు యిచ్చిన సమాచారాన్ని అవతలివాళ్లు ఎలా ఉపయోగించుకుంటారనేది వేరే విషయం. మన సైంటిస్టులు తమ స్నేహితురాళ్లకు సమాచారం అందించారా లేదా అనేదే కీలకం.'' అన్నాడు.
కేసు తిరగతోడిన టిపి సేన్‌కుమార్ ''సిబిఐ సరిగ్గా విచారణ జరపలేదు. నేను రుజువు చేయగలను. అసలు నేరమే జరగకపోయి వుంటే శ్రీవాస్తవ నాపై పగెందుకు పట్టాలి? ఈ కేసు విచారిస్తానని నా అంతట నేనేమైనా అడిగానా? ప్రభుత్వం నా కప్పగించిన పని చేశానంతే. సుప్రీం కోర్టు మూసేసిన కేసును తిరగతోడడం కరక్టు కాదని అప్పటి ప్రభుత్వానికి చెప్పాను. అయినా వాళ్లు వినలేదు. ఈ సైంటిస్టులకు ఆ అమ్మాయిలు గూఢచారిణులని తెలియదనీ, వాళ్లకు సమాచారం ఏమీ యివ్వలేదనే అనుకుందాం.
అసలు వాళ్లతో సంబంధం ఎందుకు పెట్టుకున్నారనేదైనా బయటకు రావాలిగా.'' అన్నాడు. మాత్యూస్ కూడా ''ఇస్రో కేసు చేపట్టడం వలన చాలామందికి శత్రువునయ్యాను. కేసు మూసేసిన తర్వాత కూడా నాపై పగ సాధించారు. మరియం పాకిస్తాన్ గూఢచారిణి అనేదైతే వాస్తవం. ఆమెకు టాప్ సైంటిస్టులతో సంబంధాలున్నాయనేది వాస్తవం. ఇక వాళ్లు ఆమెకు ఏం చెప్పారు అనేది వాళ్లకే తెలియాలి.'' అని వాదిస్తున్నాడు. నారాయణన్ వాదన మరోలా వుంది. ''ఇస్రో గూఢచర్యం కేసు ఎందుకు మోపారు, దానివలన ఎవరు లాభం పొందారు అనేది తెలియాలి.
ఈ కేసు కారణంగా ఇస్రో సైంటిస్టుల మనోస్థయిర్యం దెబ్బ తింది. మామూలు గవర్నమెంటు డిపార్టుమెంటులా పనిచేయసాగింది. నాలాటి వాణ్ని తప్పించడం వలన క్రయోజెనిక్ ప్రోగ్రామ్‌లో ఇండియా 15 ఏళ్లు వెనకబడి పోయింది. కేసు ఎందుకు పెట్టారో విచారణ జరపమని కోరుతూ నేను మలయాళంలో, ఇంగ్లీషులో పుస్తకం రాశాను. ఇంగ్లీషు వెర్షన్‌ను బ్లూమ్స్బరీ వాళ్లు పబ్లిష్ చేశారు. జులైలో విడుదల కావచ్చు.'' అంటున్నాడు.
ఈ కేసు వలన నష్టపోయామని నిందితులూ అంటున్నారు, విచారణ జరిపిన అధికారులూ అంటున్నారు. ఆగస్టులో తీర్పు యిచ్చే సమయంలో సుప్రీం కోర్టు ఏమంటుందో చూడాలి.
(ఫోటో – నిందితుడు నంబి నారాయణన్, విచారణాధికారి సిబీ మాత్యూస్)
– ఎమ్బీయస్ ప్రసాద్