ప్రధాని నరేంద్రమోడీ పట్ల అతి విధేయ వర్గంలో ఒకడు, భారతీయ జనతా పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడే, క్రైసిస్ మేనేజిమెంట్ నిపుణుల్లో ఒకడు అయిన కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు అనూహ్యమైన ప్రమోషన్ దక్కుతోంది. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి కాబోతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆ పదవిని అలంకరిస్తారు.
ఆరకంగా దేశంలో రెండో అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ముప్పవరపు వెంకయ్యనాయుడు కొలువుతీరుతారు. వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టాలని భాజపా సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చిందని… సోమవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చిస్తారని ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు విద్యార్థి దశ రాజకీయాలనుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక, జనసంఘ్ అనుకూల పార్టీల్లో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. నెల్లూరులో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో లా చేసిన ఆయన ఎమ్మెల్యే అయ్యాక చాలా స్వల్ప వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేస్థాయికి వెళ్లారు. దేశంలో పలు రాష్ట్రాలకు ఆయన భాజపా తరఫున ఇన్ఛార్జిగా పనిచేశారు.
తెలుగుతోపాటూ ఇంగ్లీషు, హిందీ కూడా అనర్గళంగా మాట్లాడగల వెంకయ్యనాయుడు భాజపా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. భాజపాకు జాతీయ అధ్యక్షుడు అయిన తొలి తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడే కావడం విశేషం. వాజపేయి ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఆయన పార్టీ సారధిగా ఉన్నారు. ఆతర్వాత క్రమం తప్పకుండా రాజ్యసభ సభ్యత్వం దక్కించుకుంటూ వచ్చిన ఆయన… కాంగ్రెస్ హయాంలోనూ రాజ్యసభలో పార్టీ తరఫున చురుగ్గా వ్యవహరించారు.
2014లో మోడీ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. సహజంగానే ఆయనకు సముచిత పదవులు లభించాయి. పట్టణాభివృద్ధిశాఖను నిర్వహించిన వెంకయ్య, ఆ తరువాత.. సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోడీకి వీరవిధేయుల్లో ఆయన ఒకరు. తాజాగా ఆయనను ఉపరాష్ట్రపతి చేయడానికి పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ ను ఎంపిక చేసిన భాజపా, ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణాదికి చెందిన వెంకయ్యను ఎంపిక చేయడం ద్వారా.. దక్షిణాదిపై తమకు వివక్ష ఉన్నదనే విమర్శను నీరుగార్చడానికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని అంతా అనుకుంటున్నారు. మొత్తానికి వెంకయ్యనాయుడుకు మాత్రం ఉపరాష్ట్రపతి పదవి జాక్ పాట్ లాగా తగిలిందని అంతా భావిస్తున్నారు.