కమ్యూనిస్టును అన్నాడు, కానీ పూర్తి కమ్యూనిస్టును కాను అంటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదర్శాలు బాగున్నాయని చెబుతాడు, కానీ తను ఆ పార్టీతో చేతులు కలపను అంటాడు. కరుణానిధికి మించిన తోపులేడు అని అంటాడు, స్టాలిన్ కు మించిన నాయకుడూ లేడని అంటాడు.. కానీ డీఎంకేతో సాన్నిహిత్యం ఉండదంటాడు.
ద్రవిడ సిద్ధాంతాలతో పార్టీలు మోసం చేస్తున్నాయని, అవినీతి చేస్తున్నాయని అంటాడు… తనది కూడా ద్రవిడ పార్టీనే అని చెబుతాడు! రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి, స్నేహితుడు అని అంటాడు.. కానీ ఆయన బీజేపీలో చేరడమే ఉత్తమం అని సెలవిస్తాడు. బీజేపీతో దేశానికి మంచి రోజులు రాలేదని స్పష్టం చేస్తాడు. ఇలా సాగుతోంది కమల్ హాసన్ ధోరణి.
ఇప్పుడు మరింత విశేషం ఏమిటంటే.. అవసరమైతే కమలం పార్టీతో పని చేయడానికి కూడా సిద్ధమని కమల్ ప్రకటించాడు. మరి తను కాషాయ జెండా వైపు వెళ్లను అని ఆదిలోనే కుండబద్ధలు కొట్టిన కమల్ హాసన్ ఇలా ప్రకటించడం ఒకింత విడ్డూరమే. ఇప్పటి వరకూ కమల్.. వివిధ పార్టీల వాళ్లతో చర్చలు జరిపాడు. కొందరిని కమల్ వెళ్లి కలిశాడు, మరికొందరు వెళ్లి కమల్ తో కలిశారు.
కాంగ్రెస్ వాళ్లేమో నగ్మాను పంపించారు, అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి చర్చించాడు. కమ్యూనిస్టు పార్టీల వాళ్లు కూడా చర్చలు జరిపారు కానీ.. కమల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పినరాయి విజయన్ తో సమావేశానికే పరిమితం అయ్యాడు కమల్. ఓవరాల్ గా కమల్ చాలా కన్ఫ్యూజన్ తో… రోజుకో మీడియా వర్గానికి ఇంటర్వ్యూ ఇచ్చి, రోజుకొక రకంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ కన్ఫ్యూజన్ లో కమల్ ఎంజీఆర్ అవుతాడో, విజయకాంత్ గా మిగిలిపోతాడో.. వేచి చూడాలి!