కాటమరాయుడు వర్సెస్ కట్టప్ప

సరిగ్గా 2 వారాల కిందట డీజే టీజర్ కు పోటీగా నిలిచింది బాహుబలి-ది కంక్లూజన్ మోషన్ పోస్టర్. శివరాత్రి కానుకగా బన్నీ నటించిన డీజే  టీజర్ ను విడుదల చేస్తే, కొన్ని గంటల వ్యవధిలో…

సరిగ్గా 2 వారాల కిందట డీజే టీజర్ కు పోటీగా నిలిచింది బాహుబలి-ది కంక్లూజన్ మోషన్ పోస్టర్. శివరాత్రి కానుకగా బన్నీ నటించిన డీజే  టీజర్ ను విడుదల చేస్తే, కొన్ని గంటల వ్యవధిలో బాహుబలి-2 నుంచి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అలా సోషల్ మీడియాలో ఈ రెండూ ట్రెండింగ్ అయ్యాయి. ఇప్పుడు కాటమరాయుడితో సోషల్ మీడియాలో పోటీకి సిద్ధమైంది బాహుబలి-2 సినిమా. 

పవన్ కల్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమాకు సంబంధించి ఇప్పటికే యూట్యూబ్ లో దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. మరోవారం రోజుల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా పెట్టబోతున్నారు. ఇక మార్చి 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ డేట్స్ కు దగ్గర్లోనే అటుఇటుగా బాహుబలి-2 హంగామా కూడా షురూ కానుంది. 

బాహుబలి ది కంక్లూజన్ మూవీకి సంబంధించి కట్టప్ప స్టిల్ తో తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు 2 రోజులు ముందు ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక కాటమరాయుడు విడుదలైన మరుసటి రోజున, అంటే మార్చి 25న ఆడియో ఫంక్షన్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇవి కాకుండా.. ట్రయిలర్ లాంచ్, ఆడియో ఫంక్షన్ మధ్యలో మరికొన్ని స్టిల్స్, మోషన్ పోస్టర్లు కూడా రానున్నాయి. ఇలా కాటమరాయుడు, బాహుబలి-2 ఒకే నెలలో హంగామా చేస్తూ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తున్నాయి.