బాహుబలికి సంబంధించిన వార్త ఏదయినా కనీసం అరపేజీ వేయాల్సిందే. అదీ బాహుబలి పార్ట్ వన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ పత్రిక విధానం. ఆ సినిమాను ఆ పత్రిక మోసినంతగా బాహుబలిలో శివుడు శివలింగాన్ని కూడా మోయలేదేమో? బాహుబలి సినిమా చూడకపోతే, పుష్కరస్నానం చేయకపోవడం అంత పాపం అనేంతగా ప్రచారం చేసిందా పత్రిక తొలిభాగానికి సంబందించి. దానికి అనేక కారణాలు వున్నాయని, అనేక గుసగుసలు వున్నాయి ఇండస్ట్రీలో.
నిర్మాతలో బంధాలు, పెట్టుబడి సంబంధాలు, ఇంకా ఇంకా చాలా..చాలా. సరే, అవన్నీ నిజమో కాదో కానీ, బాహుబలి పార్ట్ వన్ అపూర్వ విజయంలో మాత్రం ఆ పత్రిక పాత్ర ఎంతయినా వుందన్నది వాస్తవం. తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడానికి ఆది నుంచీ ఎంత కష్టపడిందో, బాహుబలిని విజయవంతం చేయడానికీ అంతే కష్టపడింది.
సరే, వర్తమానానికి వస్తే, బాహుబలి ఆఫీస్ మీద ఆదాయపన్ను దాడి జరిగింది. మిగిలిన పత్రికలన్నీ యథాశక్తి ఆ వార్తను పాఠకులకు అందించేందుకు ప్రయత్నించాయి. ఓ లీడింగ్ పత్రిక అయితే ఏకంగా బ్యానర్ కథనం అరపేజీ సైజులో వండి వార్చింది. కానీ ఆది నుంచీ బాహుబలిని మోస్తున్న పత్రిక అయితే అదేమీ పెద్ద ఆసక్తి కర వార్త కాదన్నట్లు 8 లైన్ల సింగిల్ కాలమ్ వార్తతో లోపల పేజీలో సరిపెట్టేసింది. అంటే ఆ సినిమా తో ఎంత అనుబంధం వుందో, బాహుబలిపై ఎంతటి అభిమానం, విశ్వాసం వున్నాయో?