ఆస్ట్రేలియాకు ఇంతకీ ఏమైంది!

టెస్టు క్రికెట్ లో వరస విజయాల విషయంలో ఆ జట్టుదే ఆల్ టైమ్ రికార్డు. వరసగా పదహారు టెస్టుల విజయ యాత్ర ను సాగించిన నేపథ్యం ఉంది. అంతేనా.. క్రికెట్ లో ఆసిస్ ఆధిపత్యానికి…

టెస్టు క్రికెట్ లో వరస విజయాల విషయంలో ఆ జట్టుదే ఆల్ టైమ్ రికార్డు. వరసగా పదహారు టెస్టుల విజయ యాత్ర ను సాగించిన నేపథ్యం ఉంది. అంతేనా.. క్రికెట్ లో ఆసిస్ ఆధిపత్యానికి బోలెడన్ని విజయాలు రుజువులున్నాయి. ప్రపంచ క్రికెట్ పై ఆసీస్ ఆధిపత్యం  అంతా ఇంతా కాదు. స్టీవ్ వా, పాంటింగ్, క్లార్క్ ల కెప్టెన్సీల్లో ఆసీస్ విజయాల్లో అరుదైన ఫీట్లను సాధించింది. ప్రపంచకప్ ల విజయాల్లో అనితర సాధ్యమైన పరంపరను కొనసాగించింది.

మరి అలాంటి జట్టుకు ఇప్పుడు ఏమైంది? వరస ఓటములు  ఆసీస్ ను కుంగదీస్తున్నాయి. శ్రీలంక పర్యటనలో ఆసీస్ క్లీన్ స్వీప్ అయిపోయింది. మూడు టెస్టుల్లోనూ ఓటమిని మూటగట్టుకుంది. 3-0 తో ఓటమి పాలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆసీస్ కు వన్డేల్లో ఓటములు కలవరపెట్టాయి. 5-0 తో ఇంటి ముఖం పట్టింది ఆసీస్.

ఇక విదేశాల్లో అంటే ఏదో  ఓడిపోతోందిలే అనుకుంటే.. స్వదేశంలోనూ ఆసీస్ కు ఓటములు తప్పడం లేదు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సీరిస్ లో ఆసీస్ తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఇక రెండో మ్యాచ్ లో అయితే ఆసీస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హోబర్ట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ ఆసీస్ 85 పరుగులకు ఆలౌట్ అయ్యింది! కెప్టెన్ స్మిత్ ఒక్కడే కాసేపు పోరాడారు. మిగతా బ్యాట్స్ మన్లు పూర్తిగా చేతులెత్తేశారు.

ఆసీస్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అల్ప స్కోర్లలో ఇది ఒకటి. ఆసీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా అనంతరం ఇన్నింగ్స్ ను ప్రారంభించి దక్షిణాఫ్రికా 173 పరుగులు సాధించింది.

ఇప్పటికే ఆసీస్ ఆట తీరుపై ఆ దేశ మాజీలు, మీడియా దుమ్మెత్తిపోస్తోంది. కెప్టెన్ స్మిత్ తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది!