మెగాఫ్యామిలీ.. మరిచిపోయినదాన్ని కెళుక్కుందా!

తమతో కలిసి చాలా సినిమాలకు పని చేసిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను ‘వాడు..’ అని సంబోధించాడు నాగబాబు. యండమూరి రచించిన చాలా నవలలు చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలుగా నిలిచాయి. చిరు…

తమతో కలిసి చాలా సినిమాలకు పని చేసిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను ‘వాడు..’ అని సంబోధించాడు నాగబాబు. యండమూరి రచించిన చాలా నవలలు చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలుగా నిలిచాయి. చిరు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలవి. యండమూరి రచించిన ‘రాక్షసుడు’ నవలను సినిమా గా తీయగా.. అందులో నాగబాబు కూడా ఒక ముఖ్యపాత్రను చేశాడు. ఆ తర్వాత కూడా చిరు సూపర్ హిట్స్ లో యండమూరి భాగస్వామ్యం ఏదో విధంగా ఉంటూ వచ్చింది.

అంత క్లోజ్ గా అసోసియేట్ అయిన వ్యక్తిపై నాగబాబు తీవ్రంగానే స్పందించాడు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇంతకీ మెగాప్యామిలీపై యండమూరి ఏమన్నాడు, ఎప్పుడన్నాడు? అని! యండమూరి ఎక్కడో మారుమూల జరిగిన వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో చిరంజీవి తనయుడి ప్రస్తావన తీసుకొచ్చాడు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ను పొగిడే క్రమంలో.. మెగాస్టార్ తనయుడి గురించి మాట్లాడాడు యండమూరి.

దేవీశ్రీ తండ్రి సత్యమూర్తి.. యండమూరి సమకాలీకుడు. చిరంజీవి, సత్యమూర్తి, కోదండరామిరెడ్డి, కేఎస్ రామారావు వీళ్లదొక హిట్ గ్రూప్. కాబట్టి యండమూరి.. దేవీ శ్రీని, చరణ్ ను దగ్గర నుంచినే చూశాడు.  వారు ఎదిగొచ్చిన దారులను, తీరును గమనించిన ఆ రచయిత.. చరణ్ సర్జరీల గురించి ప్రస్తావించినట్టుగా ఉన్నాడు!

అయితే.. యండమూరి ఏదో బహిరంగ సభలో ఆ విషయాలను మాట్లాడలేదు. యండమూరి చరణ్ ను అలా అన్నాడని కూడా చాలా మందికి తెలియదు! నాగబాబు కూడా అదే విషయాన్ని చెప్పాడు. ‘ఎవరిని అంటున్నానో మీకు తెలియకపోవచ్చు..’ అని అన్నాడు! 

మరి ఇది కెళుక్కోవడం కాదా? యండమూరి ఏమన్నాడో, ఎప్పుడన్నాడో.. ఎవరికీ తెలియదని అంటూనే.. ధూం, ధాం.. అంటే, ఇంతకీ యండమూరి ఏమన్నాడు, ఎప్పుడన్నాడు.. అనే విషయం చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు! మీడియా కూడా గతాన్ని గుర్తు చేసే పని మొదలుపెట్టింది! మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకుని  మరీ చర్చ మొదలు పెట్టినట్టున్నారు.

వర్మ మాటలకు వెన్నెముక ఉండదు కాబట్టి.. టక్కున క్షమాపణ చెప్పేశాడు. అలాగాక యండమూరి రేపు ఎదురుదాడి చేస్తే ఏం చేస్తారు?