భరత్ అనే నేను సినిమాలో క్యూట్ గా నవ్వుతూ కనిపించిన కైరాకు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. చిరాకు, అసహనం పెరిగిపోయాయి. అంతే ఏకంగా కెమెరా ముందే కత్తెర తీసుకొని తన జుట్టును కట్ చేసుకుంది. ఆ వీడియోను తనే స్వయంగా పోస్ట్ చేసింది కూడా. కొన్ని గంటల కిందట విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“చాన్నాళ్లుగా జుట్టును సంరక్షించుకోవడం కుదరట్లేదు. నా జుట్టును చాలా నిర్లక్ష్యం చేశాను. నాకే గిల్టీగా ఉంది. దీనికి ఇదొక్కటే పరిష్కారం.” ఇలా ఓ పోస్ట్ పెట్టి మరీ కెమెరా ముందు తన జుట్టును కట్ చేసి పడేసింది కైరా అద్వానీ. పనిలో పనిగా ఓ ర్యాప్ సాంగ్ పాడి మరీ ఈ పని చేసింది.
ఓ హీరోయిన్ అయి ఉండి కూడా కైరా ఇలా అడ్డదిడ్డంగా తన జుట్టును తనే స్వయంగా కట్ చేయడం వైరల్ అయింది. చాలామంది కైరా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరికొందరు మాత్రం దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టి పారేస్తున్నారు. కేవలం తన నెక్ట్స్ సినిమా మేకోవర్ కోసమే కైరా ఇలా ప్రవర్తించిందని అంటున్నారు.
లారెన్స్ దర్శకత్వంలో త్వరలోనే కాంచన రీమేక్ సెట్స్ పైకి రాబోతోంది కైరా. ఈ సినిమాలో ఆమెను కొత్తగా, మరింత అందంగా చూపించబోతున్నాడట లారెన్స్. ఇందులో భాగంగా ఆమె హెయిర్ స్టయిల్ కూడా మారబోతోందంటూ రూమర్లు వస్తున్నాయి. అంతకంటే ముందు కైరా ఇలా తన జుట్టును తానే కట్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయిందంటున్నారు చాలామంది.