ఫిబ్రవరి 9న ఎలాగైనా విడుదల చేసేయాలని అనుకుంటోంది ఎకె ఎంటర్ ప్రైజెస్ సంస్థ తన కిర్రాక్ పార్టీ సినిమాను. టఫ్ కాంపిటీషన్ వుంది ఆ రోజు. సీనియర్ హీరో మోహన్ బాబు గాయత్రి, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ తొలిప్రేమ ఆరోజే విడుదల. ఇలాంటి టైమ్ లో వదిలే ప్రొడక్ట్ చాలా సెక్యూర్డ్ గా వుండాలి.
కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఇస్తున్న టైమ్ సరిపోదని, ఇలా హడావుడిగా వదిల్తే, వికటించే ప్రమాదం వుందని, డైరక్టర్ శరణ్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. కిర్రాక్ పార్టీ లాంటి సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ చాలా జాగ్రత్తగా చేయాలని, ఎడిటింగ్, రీ రికార్డింగ్ చాలా కీలకం అని, లేదూ అంటే సమస్య అవుతుందని యూనిట్ జనాలు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇది మిస్సయితే మరో డేట్ వుండదు. పైగా ఇదే సంస్థ, హీరో రాజ్ తరుణ్ తో నిర్మించిన రాజూగాడు సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. దీనివల్ల కిర్రాక్ పార్టీ 9ని దాటనివ్వరు. తొలిసారి డైరక్షన్ చేస్తున్న కుర్రాడు. కాస్త టైమ్ ఇవ్వకుండా ఇలా గాభరా గాభరాగా పని చేయించేస్తే, ఏమవుతుందో అన్న ఆందోళన యూనిట్ జనాల్లో వినిపిస్తోంది. అసలే నిఖిల్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం.