మొత్తానికి రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట అన్ని స్థానాల్లో పోటీచేస్తామని స్పష్టంచేశారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై భిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి. అయితే ఇదంతా ఒకెత్తు. కోలీవుడ్ ఒక్కటి మరో ఎత్తు.
కోలీవుడ్ లో రజనీకాంత్ రారాజు. తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేరు. ఇంకా చెప్పాలంటే అందరివాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. మరి ఈసారి కూడా కోలీవుడ్ లో అందరివాడు అవుతాడా..? పార్టీలకు అతీతంగా నటీనటులంతా రజనీకి మద్దతు ఇవ్వగలరా..? సరిగ్గా ఇక్కడే కోలీవుడ్ రెండుగా చీలిపోయింది.
రాబోయే ఎన్నికల్లో కోలీవుడ్ స్పష్టంగా 2ముక్కులవ్వడం ఖాయం. రజనీ అంటే అందరికీ ఇష్టమే. కానీ రాజకీయాల విషయానికొచ్చేసరికి ఎవరి ప్రాధామ్యాలు వాళ్లకున్నాయి. విజయ్ కాంత్ కు సొంతంగా ఓ పార్టీ ఉంది. అతడు రజనీకాంత్ తో చేతులు కలుపుతాడా లేదా అనేది స్పష్టంగా చెప్పలేం.
కమల్ హాసన్ కూడా సొంతంగా ఓ పార్టీ పెట్టబోతున్నారు. అతడు కూడా రజనీకాంత్ తో కలిసి వస్తారా అనేది అనుమానం. వీళ్లతోపాటు హీరో విశాల్ కూడా ఎన్నికల్లో పోటీచేస్తానంటున్నాడు. మరి ఈ హీరో సొంతంగా పార్టీ పెడతాడా.. లేక రజనీతో చేతులు కలుపుతాడా అనేది సందేహాస్పదం. ఇక నటి ఖుష్బూ విషయానికొస్తే ఆమె కచ్చితంగా రజనీకాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సి రావొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితి అలాంటిది.
ఇదే సమయంలో తటస్థంగా ఉన్న అజిత్, సూర్య, విజయ్, విక్రమ్ లాంటి నటులు ఎవరికి మద్దతిస్తారనేది ఇక్కడ మరింత ఆసక్తికరం. ఎందుకంటే వీళ్లు ఒకరికి మద్దతిస్తే మరొకరికి కోపమొస్తుంది. కానీ కచ్చితంగా మద్దరు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంతా పరిశ్రమకు చెందిన వ్యక్తులే కదా. సో.. ఈసారి చీలిక తప్పదు.
తమిళనాట మొన్నటివరకు రాజకీయం వేరు సినిమా వేరు. ప్రభావవంతమైన రజనీకాంత్, కమల్ లాంటి హీరోలు పాలిటిక్స్ కు దూరంగా ఉండడం వల్ల కోలీవుడ్ పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ ఈసారి అలా జరగదు. కేవలం హీరోయిన్లు వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసే పరిస్థితి ఉండదు. హీరోలు కూడా రంగంలోకి దిగుతారు. అదే కనుక జరిగితే కోలీవుడ్ లో స్పష్టమైన చీలిక కనిపిస్తుంది.
ఇది కూడా ఒకందుకు రజనీకాంత్ కు మంచిదే. ఇన్నాళ్లూ తనచుట్టూ తిరిగి, తనను పొగడ్తల్లో ముంచెత్తి, భజన చేసిన సినీజనాల్లో ఎవరు తనవాళ్లో, ఎవరు తనకు కానివాళ్లో రజనీకాంత్ కు తెలిసొస్తుంది. తనతో ఎంతమంది కలిసొస్తారనే విషయంపై సూపర్ స్టార్ కు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆ క్లారిటీ అతడి రాజకీయ జీవితానికే కాదు, వ్యక్తిగత జీవితానికి కూడా బాగా పనికొస్తుంది.