ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. బన్నీ నటిస్తున్న 'నా పేరు సూర్య' సినిమాపై ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. న్యూ ఇయర్ కానుకగా ఈరోజు సాయంత్రం 5గంటలకు 'ఫస్ట్ ఇంపాక్ట్' పేరుతో నా పేరు సూర్య టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఇది ఆడియన్స్ కు ఎంతలా నచ్చుతుందనే అంశంపైనే సినిమా హైప్ ఆధారపడి ఉంటుంది.
ఈ సినిమా కోసం ఫారిన్ ట్రయినర్ పర్యవేక్షణలో బన్నీ బాగా కసరత్తులు చేశాడంటూ మేకర్స్ ఊదరగొట్టారు. 'ఫస్ట్ ఇంపాక్ట్'లో ఆ మేకోవర్ కనిపిస్తే ఓకే. లేదంటే నెగెటివ్ ఇంపాక్ట్ గ్యారెంటీ. రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ లో బన్నీ కెమెరా ముందుకొచ్చాడు. అందులో అతడి లుక్స్, ఫిజిక్ లో పెద్దగా తేడా కనిపించలేదు. హెయిర్ స్టయిల్ మాత్రం కొంచెం మార్చినట్టు అనిపించింది. ఫస్ట్ ఇంపాక్ట్ లో న్యూ లుక్ ఉంటే సరేసరి. లేదంటే ఫారిన్ ట్రయినర్, కసరత్తులు, న్యూ లుక్.. ఇవన్నీ ప్రచార ఆర్భాటాలు అనుకోవాల్సి వస్తుంది.
మరోవైపు నూతన సంవత్సరంలోనైనా బన్నీ సినిమా వివాదాలకు దూరంగా విజయం సాధించాలని కోరుకుందాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా వసూళ్ల పరంగా ఎంతలా విమర్శలు ఎదుర్కుందో అందరికీ తెలిసిందే. అంతకుముందు ఏడాది వచ్చిన సరైనోడు సినిమాపై కూడా ఇలాంటి కామెంట్స్ తప్పలేదు. నెగెటివ్ టాక్ వచ్చిన మూవీని దగ్గరుండి ఆడించి, తప్పుడు కలెక్షన్లు చూపించారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నా పేరు సూర్య సినిమా.. ఇలాంటి విమర్శలకు దూరంగా విజయం సాధించాలని కోరుకుందాం.
ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.