జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంబరాలు ముగిసాయి. అదేదో పండగదినం అన్నట్లుగా ఛానెళ్లు రోజులో అప్పుడప్పుడు పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ షార్ట్ విడియోలు ప్రచదర్శించి, ప్రజలకు పదే పదే గుర్తు చేస్తూ మురిసిపోయాయి. ఇలా మరే రాజకీయ స్టార్ కు చేసిన దాఖలా అయితే లేదు.
మొన్నటికి మొన్నే మెగాస్టార్ బర్త్ డే అయింది. మహేష్ బాబు బర్త్ డే అయింది. అయితే వాళ్లను అర్జెంట్ గా లేపాల్సిన పని తెలుగుదేశం అనుకూల మీడియాకు లేదనుకోండి.
చంద్రబాబును ఇఫ్పట్లో నమ్మే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు కాబట్టి, ఇక పవన్ సైజ్ ను పెంచే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సరే, ఆ సంగతి, ఆ ముచ్చట అలా వుంచితే అభిమానులు మాత్రం కోటి ట్వీట్లు వేయించే పని పెట్టుకున్నారు. ఇటీవల ఇది ఎక్కువయింది.
ఏడాదికి ముందు, ఆర్నెల్లకు మందు తమ అభిమాన నాయకుడి బర్త్ డే వ్యవహారం స్టార్ట్ చేయడం, కామన్ డీపీ వదలడం, కామన్ హ్యాష్ ట్యాగ్ వదలడం, ట్వీట్లు లెక్కపెట్టుకోవడం.
ఆ సరదా కూడా బాగానే వుంది. ట్వీట్లు వేసారు అంటే, ఇంతో అంతో చదువుకున్నవాళ్లే, అక్షరం ముక్క వచ్చిన వాళ్లే, అయి వుంటారు. అందులో సందేహం లేదు. మరి కోటి మంది ట్వీట్లు అయితే వేస్తున్నారు కానీ, ఓట్ల దగ్గరకి వచ్చేసరికి మాత్రం ఎందుకో తేడా కొడుతోంది.
సభ్యత్వాలు కోట్లలో వుంటున్నాయి. ట్వీట్లు కోట్లలో వుంటున్నాయి. కానీ ఓట్లు మాత్రం లక్షల్లోనే వుంటున్నాయి. అదేంటో. ఆ కథేంటో? ట్వీట్ లు అంటే ఫ్రీ..ఓట్లు అలా కాదేమో? పవన్ కూడా అలాగే అన్నారు. తన ఓట్లు లాక్కోవడానికి కోట్లు ఖర్చుచేసారని.
మరి ఈ కోటి ట్వీట్లు వచ్చే ఎన్నికలకు అయినా పవన్ తో పదిలంగా వుంటాయా? చూడాలి.