''సినిమా మొత్తం నాదే.. ఎవరేమనుకున్నాసరే.. 'మణికర్ణిక' దర్శకుడ్ని మాత్రం నేనే..'' అంటూ పైకి గట్టిగా చెప్పుకున్నాడుగానీ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ), ఎక్కడా ఆ సినిమా ప్రమోషన్స్‌లో కన్పించలేదు. సినిమా విడుదలయ్యాక మాత్రం, 'సినిమాని ఆదరిస్తున్నవారికి, అభినందిస్తున్నవారికీ కృతజ్ఞతలు' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
సినిమా విడుదలయ్యాకనే అసలు కథ మొదలయ్యింది. క్రమక్రమంగా క్రిష్ వర్సెస్ కంగనా – ఈ వివాదం ముదిరి పాకాన పడుతూ వస్తోంది. కంగన, ఎక్కడా క్రిష్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. సినిమాకి సంబంధించి 70 శాతం రీ షూట్ చేయాల్సి వచ్చిందంటూ కంగన చేసిన వ్యాఖ్యలతో దుమారం మరింతగా పెరిగింది. 'దాదాపు 400 రోజులపాటు నేను సినిమా కోసం వర్క్ చేసి, ప్యాచ్ వర్క్ ఒక్కటీ బ్యాలన్స్ వుండగా నేను వేరే సినిమా కోసం వెళితే, కంగన ఎలా 70శాతం షూటింగ్ చేస్తుంది.?' అని ప్రశ్నించాడు క్రిష్.
'నువ్వు చేసిన సినిమాలో 30 శాతం మాత్రమే మిగిలి వుంది.. మిగతాదంతా కంగన రీ షూట్ చేసుకున్నదే.. పైగా, ఆ 30 శాతంలో కూడా నువ్వు పూర్తిగా చేసిందేమీ లేదు..' అంటూ కంగన సోదరి 'వివాదానికి' మరింత ఆజ్యం పోసింది. ఇప్పటితో ఈ వివాదం ముగిసేలా లేదు. 'మణికర్ణిక' సినిమా కోసం తానెంత కష్టపడ్డదీ చెబుతూ, ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నాడు.. ఆ ట్వీట్లకు అటువైపునుంచి కౌంటర్లూ పడుతున్నాయి. మరి, ఈ వివాదానికి ముగింపు పడేదెలా.?
ఏమోగానీ, ఈ వివాదంలో చాలామంది క్రిష్‌నే తప్పు పడుతున్నారు. 'అసలు ఆ సినిమాని ఎందుకు వదిలేశావ్.?' అన్న ప్రశ్నలే క్రిష్ మీద ఎక్కువగా ఎక్కుపెట్టబడుతున్నాయి. 'కంగన తరిమేశాక పాపం క్రిష్ మాత్రం ఏం చేయగలడు.?' అని కొందరు మాత్రమే క్రిష్‌కి మద్దతుగా నిలబడుతున్నారు. నిజానికి 'మణికర్ణిక' దేశభక్తిని రగిల్చే చిత్రం. ఝాన్సీ కీ రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర, స్వతంత్య్ర పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఇలాంటి సినిమా విషయమై క్రిష్, కంగన రచ్చ చేయడమంటే అంతకన్నా దారుణం ఇంకోటుండదు.
కంగనా రనౌత్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఆమెతో సినిమా అంత తేలిక కాదు. ఆ విషయం తెలిసీ క్రిష్ తప్పు చేశాడు.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడన్నది మెజార్టీ అభిప్రాయం. క్రిష్ ఈ వివాదాన్ని సాగదీయడమంటే అనవసరంగా తన పేరుని చెడగొట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఓ వైపు 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' మిగిల్చిన పరాజయం నుంచి కోలుకుని, 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' సినిమాని అయినా జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది పోయి.. ఇంకా 'మణికర్ణిక' గురించి గగ్గోలు పెట్టడం దండగ వ్యవహారమే.