తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ప్రణయ్ ను కోల్పోయి విలపిస్తున్న అమృత, ఈరోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈరోజు ప్రణయ్-అమృతల పెళ్లిరోజు. ఇదే రోజున అమృత, మగ బిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ప్రస్తుతం తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ప్రణయ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణంలోని ఓ హాస్పిటల్ ముందు కొంతమంది కిరాయి హంతకులు, నడిరోడ్డుపై ప్రణయ్ ను దారుణంగా హత్యచేశారు. కూతురు, మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రి మారుతీరావే సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు అభియోగాలు నమోదుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.
అలా ఊహించని విధంగా ప్రణయ్ ను కోల్పోయింది అమృత. భర్తను పోగొట్టుకున్న సమయానికే ఆమె గర్భవతి. ఆ టైమ్ లో ఆమెకు ఎంతోమంది అబార్షన్ చేయించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించమని ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ అమృత మాత్రం బిడ్డను కోరుకుంది. ఆమె కోరిక ఈరోజు ఫలించింది. సరిగ్గా పెళ్లిరోజు నాడే మగబిడ్డ పుట్టడంతో అమృత ఆనందానికి అవధుల్లేవ్. అమృత బిడ్డకు జన్మనివ్వడంపై పలు మహిళ సంఘాలు ఆమెకు శుభాకాంక్షలు చెప్పాయి.
నాడు పంచెలు ఊడేలా కొట్టే కళ.. నేడు 'తాట తీయు' కళ
పవన్ దారెటు? సతీష్ చందర్ ఈవారం టాపిక్ అఫ్ ది వీక్