సాధారణంగా సినిమా ఫంక్షన్ లు అంటే స్వడబ్బా.. పరడబ్బా.. పరస్పర డబ్బా అన్నట్లు సాగుతాయి. నిజాలు కానీ, ఉన్నమాటలు కానీ మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. కానీ నిన్నటికి నిన్న జరిగిన కాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డైరక్టర్ మారుతి భలేగా మట్లాడారు. క్లియర్ గా చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
రజనీ-రంజీత్ కాంబినేషన్ లో వచ్చిన కబాలి అంత పెద్ద హిట్ ఏమీకాదు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే అదే కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తోంది. అదే కాలా. ఈ సినిమా ఫంక్షన్ లో పొరపాటున కూడా ఎవ్వరూ ఆ పరాజయం గురించి ప్రస్తావించరు. వేరే విషయాలు మాట్లాడతారు.
కానీ మారుతి మాత్రం చాలా పెర్ ఫెక్ట్ గా మాట్లాడారు. తెలుగులో హీరోలు సినిమా ఫ్లాప్ అయితే, డైరక్టర్ ల ఫోన్ లు లిఫ్ట్ చేయరని, అలాంటిది కబాలి బాగా ఆడకపోయినా, రంజిత్ కు మళ్లీ అవకాశం ఇచ్చిన రజనీ కాంత్ కచ్చితంగా గొప్పవ్యక్తి అని అన్నారు. అయితే ఆ సమయంలో రజనీ, రంజిత్ కాస్త మొహం ఇబ్బందిగా పెట్టుకున్నారు. అది వేరే సంగతి.
చిత్రమేమిటంటే ఆ తరువాత మాట్లాడానికి నిర్మాత దిల్ రాజు కూడా మారుతి కరెక్ట్ గా మాట్లాడారని అనడం. మొత్తంమీద కబాలి ఫ్లాప్ అని ఆ సినిమా హీరో, డైరక్టర్ వున్న స్టేజ్ మీదనే చెప్పడం విశేషమే.