నిర్మాతల మండలి (కౌన్సిల్) వుండగా ఎనిమిది మంది నిర్మాతలు ఓ గ్రూప్ గా ఏర్పాటై, మీడియాను, ప్రకటనలను నియంత్రించాలని అనుకోవడం గడచిన కొద్ది కాలంగా హడావుడి సృష్టిస్తోంది.
అయితే దీని మీద మీడియా స్పందించడమే కానీ, సినిమా రంగంలోని వారు అంతగా స్పందించడం లేదు. ఏదో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు జారుకుంటున్నారు. సురేష్ బాబు లాంటి పెద్దలు దీని వెనుక వుండడమే అందుకు కారణం. ఒక్క నట్టి కుమార్ లాంటివాళ్లే మాట్లాడారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు మరో గొంతు వినిపించింది. నిర్మొహమాటంగా మాట్లాడే తమ్మారెడ్డి భరద్వాజ ఈ వైనంపై విమర్శలు కురిపించారు. కౌన్సిల్ వుండగా ఈ అడ్డగోలు వ్యవహారం ఎందుకు అని నిలదీసారు. అసలు ఇలాంటి వ్యవహారాలు కౌన్సిల్ ను నిర్వీర్యం చేస్తాయన్నారు.
గతంలో కౌన్సిల్ తో ఒప్పందాలు, ప్రకటనలు వుండగా, ఇప్పుడు మళ్లీ ఈ హడావుడి ఎందుకున్నారు. దీని వల్ల చిన్న సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, పెద్ద వాళ్లు బాగానే వున్నారని తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు. ఇక మిగిలిన వారైనా గొంతువిప్పుతారేమో చూడాలి.