గెలిచి, ప్రమాణ స్వీకారం చేసి ఎన్నాళ్లో కాలేదు. నటీనటుల సంఘ మాలో మళ్లీ లుకలుకలు బయలుదేరాయి. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేసారు. మా సంఘానికి ఆయన ఉపాధ్యక్షుడిగా వున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పోటాపోటీగా ఓట్లు తెచ్చుకుని, ఆఖరికి విజయం సాధించారు. ఆ సమయంలోనే జరిగిన కొన్ని సంఘటనలు ఆయన మనస్తాపానికి దారి తీసినట్లు బోగట్టా. అయినా సర్దుకున్నారు. కానీ ఇప్పుడు వ్యవహారాలు మళ్లీ రోడ్డున పడేలా కనిపిస్తుండేసరికి, ఆయన ఇందులో వుండడం అనవసరం అని తన పదవికి రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ ఈస్ట్ గోదావరిలో షూటింగ్ లో వున్నారు. త్వరలో జనరల్ బాడీ మీటింగ్ నో, ఈసీ మీటింగ్ నో వుందని తెలుస్తోంది. అప్పుడు ఈ వ్యవహారాలన్నీ డిస్కషన్ కు వస్తాయని తెలుస్తోంది.