‘మా’ అధ్యక్ష ఎన్నికల సస్పెన్స్‌కి ఎల్లుండి తెరపడనుంది. ఆ రోజే ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ సినీ నటులు జయసుధ, రాజేంద్రప్రసాద్ నిలిచిన విషయం విదితమే. జయసుధ వెనుక రాజమండ్రి ఎంపీ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ వుండగా, ‘మా’ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నాగబాబు, రాజేంద్రప్రసాద్‌కి మద్దతుగా నిలిచారు.
ఇక, ఎన్నికలు గతంలోనే జరిగినా, కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు అక్రమం అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిరది. కేసును విచారించిన న్యాయస్థానం, తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది. విచారణ ముగియనుండడంతో, ఎల్లుండి ఫలితాల వెల్లడి కోసం తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సుమారు 700 మంది సభ్యులు ‘మా’లో వుండగా, అందులో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. అనేకానేక రాజకీయాల నడుమ ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి రాజకీయం, గతంలో ఎన్నడూ ‘మా’ అధ్యక్ష ఎన్నికల విషయంలో జరగలేదు. జయసుధ ‘మా’ అధ్యక్షురాలవుతుందా.? రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్ష పీఠమెక్కుతారా.? అన్నదానిపై ఎల్లుండి స్పష్టత వస్తుంది.