తెలుగు శాటిలైట్ వ్యవహారం ఓ అంతుచిక్కని పద్మవ్యూహం. చానెళ్లు, మధ్య వర్తులు, ఇంకా చాలా మంది కలిసి, రకరకాల రేట్లు పుట్టించడం ఒక ఎత్తు. రికమెండేషన్లు, లోపాయకారీ వ్యవహారాలు మరో ఎత్తు. చానెళ్లు నేరుగా కొనకుండా మధ్యవర్తుల ద్వారానే కొనడం ఇంకో ఎత్తు. దీనివల్ల అసలు రేటు ఒకటి, నిర్మాత చేతికి వచ్చేది ఇంకొకటి వుంటుంది.
సినిమా విడుదలకు ముందే మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి, రకరకాల అగ్రిమెంట్లు కుదుర్చుకుని రేటు పెంచి, ఆ తరువాత చానెళ్లకు అమ్మి, మధ్యలో లాభాలు చేసుకోవడం కూడా మామూలే. అసలు మధ్యవర్తుల జోక్యం లేకుండా శాటిలైట్ అమ్మడం అన్నది సినిమాలకు కుదిరే పని కాదు. అది పెద్ద హీరో సినిమా అయినా సరే, రేటు పెంచడానికి మధ్యవర్తులు వుండాల్సిందే.
మహానటి సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మేసారని, లేదని, మధ్యవర్తుల అగ్రిమెంట్ మాత్రం అయిందని, 11కోట్లు అని, కాదు 15 అని, కాదు, కాదు 18 అని ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటన్నది ఎక్కడా బయటకు రావడం లేదు.
సినిమా విడుదలకు సరిగ్గా మూడు రోజుల ముందు శాటిలైట్ అమ్మకం కోసం నిర్మాతలు ప్రయత్నించిన మాట వాస్తవం. కానీ మూడు రోజుల ముందు అంటే డీల్ ఫినిష్ చేయడం కష్టం అని ఆపేసారు. ఆ తరువాత రకరకాలుగా బ్రేక్ చేసి అమ్మడం కానీ, లేదా అన్నీ కలిపి అమ్మడం కానీ చేయాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవం.
అంటే అమెజాన్ కు డిజిటల్, చానెళ్లకు తెలుగు, తమిళ చానెళ్లకు తమిళం అలా. కానీ ఎక్కడా ఇంకా డీల్ ఫైనల్ కాలేదన్నది వాస్తవం. అన్ని భాషలు కలిపి కోనాలంటే సన్ నెట్ వర్క్ రంగంలోకి దిగాలి. కానీ ఆ చానెల్ ఇప్పుడు ఐపిఎల్ లో బిజీగా వుంది. విడివిడిగా అమ్మితే రేటు రాదు. ఇలా రకరకాల సమస్యలతో, ప్రస్తుతానికి ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే వుంది మహానటి శాటిలైట్ వ్యవహారం.
ఒకటి రెండు రోజుల్లో డీల్ ఫైనల్ అవుతుందని నిర్మాతలు ధీమాగా వున్నారు. ఎందుకంటే సినిమాకు మంచి పేరు వచ్చింది. తమిళనాట కూడా బాగానే షేర్ చేస్తోంది. అందువల్ల శాటిలైట్ సమస్య లేదు. ఎటొచ్చీ అనుకున్న 15 నుంచి 18కోట్లు రావడం అన్నదే సమస్య.