మహానాయకుడు సినిమాను కేవలం ఓ డిజాస్టర్ గా మాత్రమే చూడలేం. ఈ సినిమా పరాజయం ఎన్నో విషయాల్ని చెబుతోంది. మరీముఖ్యంగా బాలకృష్ణ కెరీర్ కు ఇది డేంజర్ బెల్స్ మోగించింది. అవును.. మహానాయకుడు ఫ్లాప్ తో ఇక బాలయ్య సినిమాలకు స్వస్తి చెబితే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బాలయ్యకు అట్టర్ ఫ్లాపులు, డిజాస్టర్లు కొత్తకాదు. ఆయన ఎన్నో డిజాస్టర్లు చూశాడు. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడు. వరుసగా ఫ్లాపులు ఇచ్చిన టైమ్ లో కూడా నిరుత్సాహపడలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒక దర్శకుడు తనకు హిట్ ఇవ్వకపోడు అనే నమ్మకంతో పనిచేస్తూ వచ్చాడు. అలా బోయపాటి చలవతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాడు బాలయ్య.
సింహాకు ముందు వరుసగా ఏడుఫ్లాపులు చూశాడు బాలయ్య. అవి కూడా అలాంటిలాంటి ఫ్లాపులు కావు. మహారథి, ఒక్కమగాడు, పాండురంగడు లాంటి సినిమాల్ని కనీసం యావరేజ్ మూవీస్ అని కూడా చెప్పలేం. అలాంటి అట్టర్ ఫ్లాపులు చూసిన తర్వాత సింహాతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు బాలయ్య.
సింహా తర్వాత కూడా అతడ్ని ఫ్లాపులు వెక్కిరించాయి. కానీ అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడు. అభిమానుల కోసమే ఇదంతా అని కవర్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మహానాయకుడు సినిమా డిజాస్టర్ అయిందో ఇక బాలయ్యకు కవర్ చేసుకునే అవకాశం కూడా దక్కలేదు. ఎందుకంటే మహానాయకుడు సినిమాను సామాన్య ప్రేక్షకుల కంటే ముందు నందమూరి అభిమానులే తిరస్కరించారు. కాబట్టి బాలయ్యకు ఇక సర్దిచెప్పుకునే ఛాన్స్ దక్కలేదు.
స్వయంగా తన తండ్రిగారి బయోపిక్ అయినప్పటికీ, నందమూరి అభిమానులు మహానాయకుడ్ని పట్టించుకోకపోవడంతో బాలయ్య కెరీర్ పై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇకనైనా బాలయ్య సినిమాల నుంచి తప్పుకొని తన వారసుడ్ని తెరపైకి తీసుకొస్తే బాగుంటుందనే సలహాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు రిటైర్ అవ్వడానికి ఇష్టంలేకపోతే.. గతంలో హిట్లర్ కు ముందు చిరంజీవి గ్యాప్ తీసుకున్నట్టు కనీసం ఓ రెండేళ్లయినా గ్యాప్ తీసుకోవాలని స్వయంగా ఆయన అభిమానులే సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల సీజన్. నిజంగా బాలయ్య గ్యాప్ తీసుకోవాలనుకుంటే ఇదే సరైన టైమ్. ఎన్నికల వల్ల కొత్త సినిమా ప్రకటించలేకపోయానంటూ కవర్ చేసుకోవడానికి ఓ అవకాశం అయినా దక్కుతుంది. కానీ బాలయ్య మాత్రం గ్యాప్ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. బోయపాటి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు. ఓవైపు జనమంతా బాలయ్యను తప్పుకోమంటుంటే.. మరోవైపు ఆయన మాత్రం ఇలా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..
చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!