మహర్షి సినిమా మహేష్ కే లాభం?

సాధారణంగా సినిమా చేస్తే ముందుగా లాభం వచ్చేది హీరోకు. ఎందుకంటే మంచి రెమ్యూనిరేషన్ వుంటుంది కాబట్టి. తరువాత దర్శకుడికి. ఆ పైన సినిమా విడుదలై, హిట్టయితే నిర్మాతకు. మహర్షి సినిమా పూర్తయిపోయింది. బిజినెస్ కూడా…

సాధారణంగా సినిమా చేస్తే ముందుగా లాభం వచ్చేది హీరోకు. ఎందుకంటే మంచి రెమ్యూనిరేషన్ వుంటుంది కాబట్టి. తరువాత దర్శకుడికి. ఆ పైన సినిమా విడుదలై, హిట్టయితే నిర్మాతకు. మహర్షి సినిమా పూర్తయిపోయింది. బిజినెస్ కూడా పూర్తయిపోయింది. అందువల్ల ఈ సినిమా వల్ల నిర్మాతలకు ఏ మేరకు లాభం? అన్నది క్వశ్చను.

మహర్షి సినిమాకు నిర్మాతలు ముగ్గురు. అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు. అయితే ఈ ముగ్గురిలో అశ్వనీదత్ మినహా మిగిలిన వారికి ఈ సినిమా వల్ల పెద్ద ఉపయోగం లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నిర్మాత పివిపికి ఈ సినిమా వల్ల అస్సలు ఉపయోగం లేదని, పైగా నష్టమే అని కూడా టాక్ వుంది.

ఎలా అంటే..
అశ్వనీదత్ ఎప్పుడో జమానా కాలం నాడు మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చారు. వడ్డీనే తడిసి మోపెడయింది. ఇప్పుడు ఈ సినిమా మిగిలిన వారితో కలిసి చేయడంతో, ఆ అడ్వాన్స్ కోసం అప్పు ఇచ్చిన పివిపి కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో, అశ్వనీదత్ కు కలిసివచ్చినట్లు బోగట్టా. వడ్డీ రేటు తగ్గించడం ముందుగా కలిసి వచ్చిన అంశం. పైగా ఆ వడ్డీని కూడా సినిమా కోసం చేసిన ఖర్చు కాబట్టి, నిర్మాణ వ్యయంలో జోడించేసినట్లు తెలుస్తోంది. అంటే అశ్వనీదత్ వడ్డీని మిగిలిన ఇద్దరూ షేర్ చేసుకున్నట్లేగా? ఇంకా గమ్మత్తు ఏమిటంటే, పివిపి తను ఇచ్చిన అప్పుపై వడ్డీ భారాన్ని తను కూడా కాస్త మోసినట్లు అన్నమాట.

ఇక రెండో పాయింట్. బ్రహ్మోత్సవం టైమ్ లోనే పివిపికి మరో సినిమా అగ్రిమెంట్ వుంది. బ్రహ్మోత్సవం జయాపజయాలతో సంబంధం అస్సలులేదు. ఇప్పడు ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు అయ్యారు. అంటే పివిపికి 100శాతం సినిమా రావాల్సింది బదులు 33 శాతమే వచ్చింది.

ఇంకో గమ్మత్తు కూడా వుంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తరువాత, మహేష్ బాబు అయిదు కోట్లు వెనక్కు ఇవ్వడానికి మాట ఇచ్చారని బోగట్టా. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా నేపథ్యంలో అది సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఎలా? ఈ సినిమాను పివిపికి కూడా చేస్తున్నారు కాబట్టి, అయిదు కోట్లు కాకుండా రెండున్నర కోట్లే వెనక్కు ఇవ్వడానికి సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

అంటే పివిపికి రావాల్సిన పరిహారం రెండున్నర కోట్లు పోయింది. సోలోగా చేయాల్సిన సినిమా పోయింది. తను ఇచ్చిన అప్పు మీద వడ్డీ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆ వడ్డీ భారాన్ని ప్రొడక్షన్ లో వేయాల్సి వచ్చింది. పోనీ అలా అని ఈ సినిమా మీద లాభాలు వస్తాయా? అంటే ప్రొడక్షన్ ఖర్చు భయంకరంగా అయిపోయిందని తెలుస్తోంది.

నిర్మాత దిల్ రాజుకు సోలో సినిమా కాస్తా పార్టనర్ షిప్ అయింది. ప్రొడక్షన్ కష్టం అంతా ఆయనే పడ్డారు. మిగిలింది ఏమిటీ అంటే, నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం. అందులో లాభాలు వస్తే వచ్చినట్లు. ఇదిలావుంటే అందరికన్నా లాభం మహేష్ బాబుకే. ముగ్గురు నిర్మాతల కమిట్ మెంట్లు ఒక్క సినిమాతో ఎగిరిపోయాయి.

బ్రహ్మోత్సవంకు ఇస్తా అన్న అయిదు కోట్లకు రెండున్నర కోట్లు మిగిలినట్లు తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ ఎలాగూ మామూలే. సినిమాల తెరవెనుక సంగతులు ఇలా వుంటాయి మరి.

ఏపీ రాజకీయంలో ఏం జరుగుతోంది?