నా పేరు సూర్య సినిమాకు ఎప్పుడో విడుదల డేట్ ప్రకటించారు. కానీ ఈ మధ్యనే అదే డేట్ కు తాము వస్తున్నట్లు భరత్ అనే నేను సినిమా నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. దీంతో తాము వెనక్కు తగ్గే సమస్యే లేదని, తాము ముందు డేట్ ప్రకటించామని, అందువల్ల ఏది ఏమైనా అదే డేట్ కు వస్తామని బన్నీ సినిమా యూనిట్ ప్రకటించేసింది. దీంతో మహేష్ సినిమా నిర్మాత దానయ్య పరిస్థితి ఇబ్బందిలో పడింది.
ముందుకు వెళ్తే, అరవింద్ లాంటి పెద్దాయినతో తంటా. భవిష్యత్ లో బన్నీతో సినిమా చేయాలన్నా ఇబ్బంది. లేదూ అలా అని వెనక్కు తగ్గితే, తన హీరో మహేష్ తో సమస్య. అందుకే ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించుకునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలిసింది.
జస్ట్ రెండు రోజుల క్రితం ఓ సాయంత్రం దానయ్య వెళ్లి, గీతా ఆఫీసులో బన్నీవాస్, నాగబాబులతో చర్చలు సాగించినట్లు తెలిసింది. 'ఏప్రియల్ 27న బన్నీ సినిమా వుందన్న సంగతి తనకు గుర్తు లేదని, పొరపాటున డేట్ ప్రకటించానని, ఇప్పుడు ఏం చేద్దామన్నది మీరే చెప్పండని' దానయ్య కోరినట్లు తెలుస్తోంది.
దానికి గీతా వర్గాలు 'తాము ఇప్పుడు వెనక్కు తగ్గితే రీజన్ అనేది లేకుండా తగ్గినట్లు అవుతుందని, చాలా సమస్యలు వస్తాయని, అదే దానయ్య తెలియకుండా డేట్ ప్రకటించారు కాబట్టి, తెలిసి సరిదిద్దుకున్నట్లు అవుతుందని' వివరించినట్లు తెలుస్తోంది. ఆఖరికి మరో సారి కూర్చుందామని సమావేశం ముగించారని వినికిడి.
చరణ్ రంగస్థలం వచ్చిన రెండు వారాలకు మహేష్ సినిమా అంటే ఏప్రియల్ 13న, ఆ తరువాత రెండు వారాలకు బన్నీ సినిమా వచ్చేలాగ అయితే బెటర్ అని గీతా వర్గాలు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సమ్మర్ లో చాలా సినిమాలు వున్నాయి. కేవలం ఈ మూడు పెద్ద సినిమాలే కాకుండా, ఇంకా మీడియం సినిమాలు వున్నాయి.
వీటన్నింటికి తోడు రోబో 2కనుక జనవరి నుంచి సమ్మర్ కు వస్తే, మొత్తం సీన్ మారిపోతుంది.