సూపర్ స్టార్ మహేష్ బాబు-క్లాస్ డైరక్టర్ పరుశురామ్ ల కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ప్లస్, జిఎమ్బి సంస్థలు మూడూ పాలు పంచుకుంటాయని కూడా ఫిక్సయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సంస్థలు మూడు అయినా లాభాలు నలుగురు పంచుకోవాలనే వార్తలు కూడా వినవస్తున్నాయి.
విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టు ను సెట్ చేయడంలో దర్శకుడు కొరటాల శివ ముందు నుంచీ యాక్టివ్ గా వున్నారు. దానికి ఆయనకు కూడా లాభాల్లో వాటా వుందని ముందు నుంచీ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా 25 శాతం లాభం మహేష్ కు, మిగిలినది సగం మైత్రీ, సగం 14రీల్స్ ప్లస్ కు అని ఫిక్స్ అయినట్లు వినిపిస్తోంది.
మరి కొరటాల శివ సంగతేమిటన్నది ప్రశ్న. ఎందుకంటే పరుశురామ్ ను మహేష్ బాబును లింక్ చేసిందే కొరటాల శివ. అప్పట్లోనే ఆ ప్రాజెక్టు సెట్ అయితే తనకు వాటా వుండాలని ఆయన మైత్రీకి షరతు పెట్టారని బోగట్టా. మరి ఇప్పుడు ప్రాజెక్టు సెట్ అయింది కాబట్టి మరి ఆయన వాటా సంగతి ఏమిటన్నది ప్రశ్న.
ఇదిలా వుంటే పరశురామ్ తో తాము సినిమా చేయాలి కాబట్టి చేయడం తప్ప, ఇన్నివాటాల వల్ల ఈ ప్రాజెక్టులో లాభం ఏమీ వుండదని 14రీల్స్ అధినేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహేష్ నాన్ థియేటర్ హక్కులు తన పారితోషికంగా తీసుకుంటున్నారు. కానీ ఈ సినిమా విషయంలో కొంత పారితోషికం. కొంత లాభాల్లో వాటా కింద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.