మనుషులను పశువులుగా భావంచి హింసించడం తమ జన్మ హక్కు అని పోలీసులు బలంగా నమ్ముతారు. ఒళ్లుపై ఖాకీ యూనిఫాం ఉంటే ఎవరినైనా, ఏమైనా చేయొచ్చని భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే పోలీసుల ప్రవర్తన కూడా ఉంటుంది. అందుకే పోలీసుల వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా, న్యాయస్థానాలు మందలించినా పోలీసుల అమానవీయ ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తన తండ్రిని కొట్టొదని ఓ పదేళ్ల పిల్లవాడు వేడుకున్నా ఏ మాత్రం చలించని పోలీసుల కాఠిన్య ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం నుంచి రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎవరూ తప్ప పట్టరు. కానీ దీన్ని సాకుగా తీసుకుని పోలీసులు శ్రుతి మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ కంటే పోలీసుల హింసే ఎక్కువ బాధ పెడుతున్నదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. కిందపడేసి తన్నారు. ఇదంతా బాధితుడి పదేళ్ల కుమారుడి ఎదుటే జరగింది.
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయ వద్దంటూ ఆ పిల్లాడు ఏడుస్తూ పోలీసుల్ని వేడుకున్నా… ఆ పోలీసుల హృదయాలు కరగలేదు. గొడ్డును బాదినట్టు నడిరోడ్డుపై అమానుషంగా ప్రవర్తించారు. ‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బతిమలాడుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.
చివరికి చెప్పులు వేసుకోవటానికి కూడా పోలీసులు అంగీకరించలేదు. పిల్లాడిని, అతడి తండ్రిని జీపులో కుక్కి పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. దీన్ని ఎవరో అజ్ఞాత వ్యక్తులు చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు పోలీసుల అమానవీయ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్ మినిష్టర్ మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. సదరు పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.